China Pneumonia Virus: చైనాలో న్యుమోనియా.. భారత్‌లో ఆరు రాష్ట్రాల్లో హై అలెర్ట్!
చైనా(China)లో పిల్లలో శ్వాసకోస(Pneumonia) వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఆరు రాష్ట్రాలు తమ ఆరోగ్య మౌలిక సదుపయాలను అలర్ట్ మోడ్‌లో ఉంచాయి. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు శ్వాస సమస్యలపై ఫిర్యాదు చేసే రోగుల సమస్యలను పరిష్కరించడానికి సంసిద్ధంగా ఉండాలని ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని కోరాయి. మరోవైపు సీజన్ ఫ్లూ పట్ల పౌరులు అప్రమత్తంగా కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. సీజనల్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితులు ఆందోళనకరంగా లేకున్నా, మెడికల్ సిబ్బంది మాత్రం అప్రమత్తంగా ఉండాలని రాజస్థాన్ ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ చేసింది.
శ్వాస కోశ కేసులపై నిఘా పెట్టాలన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం
శ్వాస కోశ కేసులపై నిఘా పెట్టాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. ఉత్తరాఖండ్ లోని చమోలీ, ఉత్తరకాశీ, పిత్తోర్‌ఘర్ జిల్లాలు చైనా బోర్డర్‌లో ఉండడం గమనార్హం. ఇక కోవిడ్ వేళ ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల్ని ఇప్పుడు మళ్లీ బలోపేతం చేయనున్నట్లు గుజరాత్ మంత్రి రుషికేశ్ పటేల్ చెప్పారు. ఉత్తర చైనాలో, ముఖ్యంగా పిల్లలలో శ్వాసకోశ వ్యాధుల కేసుల పెరుగుతుండటం ఆందోళనలను రేకెత్తిస్తోంది. రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లను ఉపయోగించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.