Page Loader
36 గంటల తర్వాత రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం
36గంటల తర్వాత రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం

36 గంటల తర్వాత రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం

వ్రాసిన వారు Stalin
Jun 08, 2023
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం, ఇంజిన్‌ లోపం తలెత్తడంతో రష్యాలోని మారుమూల పట్టణమైన మగదాన్‌లో అత్యవసరంగా ల్యాండింగ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ విమానం దాదాపు 36 గంటల తర్వాత గురువారం 232 మంది ప్రయాణికులతో శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరినట్లు ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్ ధృవీకరించింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలు దేరిన విమాన దృశ్యాలను ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్ గురువారం ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇంజన్ లోపం కారణంగా దిల్లీ నుంచి బయలుదేరాల్సిన ఏఐ173 విమానం మంగళవారం రష్యాలోని మగదాన్‌కు మళ్లించబడిందని టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ సమయంలో విమానంలో 216మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు.

ఎయిర్ ఇండియా

ప్రత్యేక విమానంలో ప్రయాణికుల తరలింపు

ఎయిర్ విమానం మగదాన్‌‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులను వసతి గృహంలో ఉంచారు. ఇదే సమయంలో ఎయిర్ ఇండియా తమ ప్రయాణికులను వీలైనంత త్వరగా మగదాన్‌‌ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇంజిన్ మరమ్మతులు ఆలస్యం కావడంతో ముంబై నుంచి ప్రత్యేక విమానాన్ని మగదాన్‌‌‌కు ఎయిర్ ఇండియా పంపింది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో దాదాపు 36 గంటల తర్వాత ప్రయాణికులు రష్యాలోని మగదాన్‌‌‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరారు. విమానంలో 50 కంటే తక్కువ మంది అమెరికన్ పౌరులు ఉన్నారని, వారిలో ఎవరూ రష్యాలోని యూఎస్ ఎంబసీకి చేరుకున్నట్లు సమాచారం లేదని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు.