
Telangana: నకిలీ క్లినిక్‌లపై కఠిన చర్యలు.. పట్టుబడితే రూ.5లక్షలు ఫైన్!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా పెరుగుతున్న నకిలీ క్లినిక్‌లు, అనుమతుల్లేని నర్సింగ్ హోంలు, రిజిస్ట్రేషన్ లేకున్నా నడుస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది.
త్వరలో ప్రతి గల్లీలో సర్వే నిర్వహించి ఇలాంటి క్లినిక్‌లను గుర్తించనుంది.
తొలిసారి దొరికితే రూ.50 వేలు జరిమానా విధించనుండగా, రెండోసారి అనుమతులు లేకుండా కొనసాగిస్తే రూ.2 లక్షలు, మూడోసారి పట్టుబడితే రూ.5 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Details
187 నకిలీ క్లినిక్ లు సీజ్
గతేడాది ఔషధ నియంత్రణశాఖ మొత్తం 187 నకిలీ క్లినిక్‌లను సీజ్ చేసింది. ఇందులో అధిక శాతం గ్రేటర్ పరిధిలో ఉండటం గమనార్హం. ముఖ్యంగా నగర శివార్లు, బస్తీల్లో ఇలాంటి క్లినిక్‌లు ఎక్కువగా వెలుస్తున్నాయి.
కొందరు ఎలాంటి వైద్య పట్టా లేకుండా, కేవలం ఓ వైద్యుడి వద్ద కొంతకాలం అనుభవం సంపాదించి, చిన్న గదిని అద్దెకు తీసుకొని క్లినిక్‌ను నడుపుతున్నారు.
ఈ క్లినిక్‌లలో చికిత్స పొందుతున్న పేద ప్రజలకు మందులు సైతం అవే సిఫార్సు చేస్తున్నారు.
తక్కువ ధరలో సేవలు అందుతున్నాయని భావించి వారు ఈ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.
Details
నిబంధనలు ఇవే
ఆసుపత్రి, క్లినిక్, నర్సింగ్ హోం నడిపించాలంటే ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం వైద్య ఆరోగ్యశాఖ అనుమతి తప్పనిసరి. అయితే అనేక క్లినిక్‌లు, డెంటల్ హాస్పిటల్స్, ఫిజియోథెరపీ సెంటర్లు, ఆయుష్ ఆసుపత్రులు ఎలాంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
డయోగ్నొస్టిక్ సెంటర్లు సైతం ఇలాగే అనుమతుల్లేకుండా నడుస్తున్నాయి. ఇలాంటి కేంద్రాల్లో పీసీ పీఎన్‌డీటీ యాక్ట్ అమలు చేయాలి.
కానీ కొన్ని కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది.
నగరంలో వందలాది డయోగ్నోస్టిక్ సెంటర్లు ఉంటే, వాటిలో కేవలం 47 మాత్రమే అధికారిక అనుమతులు పొందాయి.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద కేవలం 925 క్లినిక్‌లే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి.
Details
రెన్యువల్ చేసుకోవాలి
ఆయా క్లినిక్‌లకు ఐదేళ్లకోసారి రెన్యువల్ చేయాల్సి ఉంటే అనేక క్లినిక్‌లు దీనిని కూడా పాటించడం లేదు.
కొన్ని ఔషధ దుకాణాలకు అనుమతులు లేకపోయినా, క్లినిక్‌లకు అనుసంధానంగా నడుపుతున్నారు. ఎక్కువ మోతాదులో యాంటీబయోటిక్స్‌ను సిఫార్సు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.
ఈ నేపథ్యంలో నకిలీ క్లినిక్‌లు, అనుమతిలేని ఆసుపత్రులను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
జరిమానాల విధింపు ద్వారా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ కీలక అధికారి తెలిపారు.