Page Loader
Sheesh mahal: షీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం: రేఖా గుప్తా
షీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం: రేఖా గుప్తా

Sheesh mahal: షీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం: రేఖా గుప్తా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో దిల్లీలో 'శీష్‌ మహల్‌' పేరు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, దిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆ బంగ్లాను మ్యూజియంగా మార్చనున్నట్లు ప్రకటించారు. ''ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం. అలాగే, నాకు ఈ పదవిని ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు'' అని ఆమె జాతీయ మీడియాతో వెల్లడించారు.

వివరాలు 

నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించాం, కానీ కేజ్రీవాల్..

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో, ఆయన సివిల్ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే, బీజేపీ ఈ బంగ్లాను 'శీష్ మహల్' (అద్దాల మేడ)గా అభివర్ణించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, కేజ్రీవాల్ దాన్ని ఏకంగా 7-స్టార్ రిసార్ట్‌గా మార్చుకున్నారని తీవ్ర విమర్శలు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ''నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించాం, కానీ కేజ్రీవాల్ మాత్రం అద్దాల మేడను నిర్మించుకున్నాడు'' అంటూ ఎద్దేవా చేశారు.

వివరాలు 

అవినీతి ఆరోపణలు ఆమ్‌ఆద్మీ పార్టీకి భారీగా నష్టం

ఆప్ మోసాలను అద్దాల మేడగా చూపిస్తూ, బీజేపీ దీన్ని ఎన్నికల ప్రచారంలో ఓ ప్రధాన అంశంగా తీసుకుంది. ఈ అవినీతి ఆరోపణలు ఆమ్‌ఆద్మీ పార్టీకి భారీగా నష్టం కలిగించాయి, చివరకు బీజేపీకి విజయాన్ని అందించాయి. ప్రజల్లో అనవసర విమర్శలు రాకుండా ఉండేందుకు, బీజేపీ ఈ బంగ్లాను ఉపయోగించకూడదని ముందుగానే నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దిల్లీకి కొత్తగా వచ్చనున్న ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ బంగ్లాలో నివసించే అవకాశం లేదన్న ఊహాగానాల నడుమ, ఆమె తాజా ప్రకటనతో ఈ అంశానికి క్లారిటీ వచ్చింది.

వివరాలు 

వేడుక కోసం 25,000 మంది భద్రతా సిబ్బంది

ఇదిలా ఉండగా, రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం రామ్‌లీలా మైదానంలో గురువారం వేలాది మంది ప్రజల సమక్షంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌ షా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ తోపాటు ఎన్డీయే నేతలు, పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఈ వేడుక కోసం దాదాపు 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ పాలనలో ఉన్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేరు. ఈ నేపథ్యంలో, పార్టీ అధిష్ఠానం రేఖా గుప్తాను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడంపై ప్రత్యేక ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.