Page Loader
Earthquake: దిల్లీలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 4.1గా తీవ్రత నమోదు 

Earthquake: దిల్లీలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 4.1గా తీవ్రత నమోదు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో గురువారం ఉదయం సుమారు 9.4 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ పరిధిలోని ప్రాంతాలు ప్రకంపనలతో కంపించాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. భూమి సుమారు ఒక నిమిషం పాటు కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. హర్యానా రాష్ట్రంలోని రోహతక్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు సమాచారం. ప్రకంపనల ప్రభావంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. భూమి కంపించడంతో పలువురు బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు అందుబాటులో లేవు.

వివరాలు 

ఢిల్లీలో బుధవారం సాయంత్రం నుండి భారీ వర్షాలు

అంతేకాకుండా, ఢిల్లీలో బుధవారం సాయంత్రం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల ప్రభావంతో నగరంలో జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఉదయం ఉద్యోగాలకు వెళ్తున్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు రహదారులపై మోకాలి లోతు వరకూ చేరడంతో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. ఇదే సమయంలో విమాన రాకపోకలకూ గణనీయమైన అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. గురువారం, శుక్రవారం రోజుల్లో వర్షపాతం మరింతగా పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వివరాలు 

 ఢిల్లీలో 'రెడ్ అలర్ట్'

ప్రస్తుతం ఢిల్లీలో వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్'ను 'రెడ్ అలర్ట్'గా మార్చినట్లు ప్రకటించింది. నిన్నటి నుండి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నదని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. నజాఫ్‌గఢ్ ప్రాంతంలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించింది. గురువారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కొనసాగుతుందని సూచించింది. నెహ్రూ ప్లేస్, అరబిందో మార్గ్, లజ్‌పత్ నగర్ వంటి ముఖ్య ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయాలు నెలకొన్నాయి. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక గురుగ్రామ్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడి అనేక అపార్ట్‌మెంట్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. ఈ దృశ్యాలను బాధితులు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. వర్షపు ధాటికి అక్కడి నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.