ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను అధ్యయనం చేస్తున్న భారత రక్షణ దళాలు
ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడులపై భారత సైనిక నాయకత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది. అక్టోబర్ మూడో వారంలో జరగనున్న భారత ఆర్మీ కమాండర్ల సదస్సులో కూడా ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు జాతీయ మీడియాకి తెలిపారు. హమాస్ చేసిన ఉగ్రదాడిని అంచనా వేయడంలో ఇజ్రాయెల్ ఏజెన్సీల వైఫల్యానికి దారితీసే గూఢచార సేకరణలో సాధ్యమైన అంతరాలను కూడా భారత బలగాలు అధ్యయనం చేస్తున్నాయి. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ శనివారం దక్షిణ ఇజ్రాయెల్‌లో రాకెట్ దాడులను ప్రారంభించింది. రెండు వైపులా 1,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో కనీసం 900 మంది మరణించగా,2,600 మంది గాయపడ్డారు.
భారతదేశం ఉగ్రవాదాన్ని ఖండిస్తోంది: మోదీ
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 143 మంది పిల్లలు,105 మంది మహిళలు సహా 704 మంది మరణించగా, 4,000 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇజ్రాయెల్ నేత బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో భారతదేశ ప్రజలు ఇజ్రాయెల్‌తో ఉన్నారన్నారు. భారతదేశం ఉగ్రవాదాన్ని నిస్సందేహంగా ఖండిస్తుందని x పోస్ట్‌లో రాసుకొచ్చారు. హమాస్ ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా US అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఇజ్రాయెల్‌కు తమ మద్దతును అందించారు. US విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా ఇజ్రాయెల్‌ను సందర్శించి, కొనసాగుతున్న దాడులపై చర్చించడానికి ఆ దేశ నేతలను కలవనున్నారు.