
Telangana: తెలంగాణ అంగన్‌వాడీల్లో పిల్లలకు చక్కెర రహిత పౌష్టికాహారం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలకు చక్కెర లేకుండా పౌష్టికాహారం అందించాలన్న యోచనను ప్రభుత్వం తీసుకుంటోంది. చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడకుండా కాపాడే ఉద్దేశంతో, ఆహార నిపుణుల సూచనల మేరకు ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీల్లో బాలామృతం పేరుతో సరఫరా చేసే ఆహారం గోధుమలు, శనగపప్పు, పాలపొడి, నూనె, చక్కెర వంటి పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఇందులో చక్కెర మినహా మిగతా పదార్థాలలో ఐరన్, కాల్షియం, విటమిన్లు ఉన్నాయి. అంగన్‌వాడీల్లో పిల్లలకు స్నాక్స్‌గా అందిస్తున్న ఆహారంలో పోషక విలువలు తక్కువగా ఉండటంతో పాటు, దాని వలన చిన్న వయస్సులోనే మధుమేహానికి కారణమవుతుందని పోషకాహార నిపుణులు గుర్తించారు.
వివరాలు
కొత్త ఆహార పదార్థాల పట్టిక రూపొందించేందుకు సిద్దమవుతున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. చిన్నప్పటినుంచే పిల్లలు చక్కెర లేకుండా ఆహారం తినే అలవాటు పెంచుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది భవిష్యత్తులో వారికి మధుమేహం నుంచి రక్షణ కలిగించగలదని నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కొత్త ఆహార పదార్థాల పట్టిక రూపొందించేందుకు సిద్ధమవుతోంది. చక్కెరను తొలగించి ఇతర పౌష్టిక పదార్థాలను చేర్చే అంశంపై పౌష్టికాహారం నిపుణులు, టీజీ ఫుడ్స్ సంస్థ అధికారులతో కలిసి సమావేశాలు నిర్వహించి ప్రతిపాదనలు సేకరించారు. చక్కెర స్థానంలో మాంసకృత్తులు అధికంగా ఉండే పదార్థాలను ఆహార పట్టికలో చేర్చే అవకాశముందని అధికారులు వెల్లడించారు.