
southwest monsoon: నైరుతి వేళ వేసవిని తలపిస్తున్న ఎండలు.. పల్నాడు జిల్లాలో 40.5 డిగ్రీలు..
ఈ వార్తాకథనం ఏంటి
నైరుతి రుతుపవనాల సమయంలోనూ వేడి తగ్గకపోవడం గమనార్హం. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఈ సంవత్సరం వడగాలుల తీవ్రత తక్కువగానే ఉండి, వేసవి సీజన్ ముందుగానే ముగిసిపోయింది. ఎండతాపానికి ప్రజలు కొంతవరకు ఉపశమనం పొందినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. రాష్ట్రంలో వారం రోజులుగా పొడి వాతావరణం నెలకొనడంతో వర్షాకాలం మధ్యలోనూ వేడి, ఉక్కపోత కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ వరకు అల్పపీడనాలు వరుసగా ఏర్పడుతున్నాయి. దీని వల్ల తేమ ఆ ప్రాంతాల్లోనే నిలిచిపోయి, దిగువ ప్రాంతాల్లో పొడి వాతావరణ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
వివరాలు
వానల కోసం 18 వరకూ ఆగాల్సిందే..
ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకుపైగా నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో సోమవారం అత్యధికంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కళింగపట్నం,విశాఖపట్నం,తుని,కాకినాడ,నరసాపురం,మచిలీపట్నం, గన్నవరం, బాపట్ల, కడప తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి 3 నుంచి 7 డిగ్రీల మేర ఎక్కువగా నమోదవుతున్నాయి. విజయవాడ, విశాఖ నగరాల్లో ఎండ తీవ్రతకు జనాలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. శీతలీకరణ పరికరాలైన ఏసీలు, కూలర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 18 తర్వాత వర్షాలు కురిసే అవకాశముందని భావిస్తున్నారు. ద్రోణి ఏర్పడి, దాని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
రాజస్థాన్, మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఏర్పడిన మరో అల్పపీడనం
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంగా నదీ పరివాహక ప్రాంతమైన పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది మంగళవారం నాటికి పశ్చిమ-వాయవ్య దిశగా పశ్చిమబెంగాల్ మీదుగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఏర్పడిన మరో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ-వాయవ్య దిశగా రాజస్థాన్ మీదుగా కదిలే అవకాశముంది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం, ఝార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.