ఏపీ రాజధాని అమరావతి కేసును డిసెంబర్‌కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు పూర్తిస్థాయి విచారణ కోసం డిసెంబర్‌కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తెలిపింది. మరోవైపు రాజధాని కేసుపై అత్యవసర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ అభ్యర్థించారు. ఈ క్రమంలో స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ వరకు రాజ్యాంగ ధర్మాసనాలకు కేసులు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌లోపు అత్యవసర కేసు విచారణ సాధ్యం కాదని సుప్రీం స్పష్టతనిచ్చింది.
ఇద్దరు ప్రతివాదులు మినహా మిగతా వాళ్లందరికీ నోటీసులు అందించాం : రిజిస్ట్రీ
రాజధాని కేసులో ప్రతివాదులందరికీ పూర్తిస్థాయిలో నోటీసులు అందలేదని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పేర్కొంది.ఈ నేపథ్యంలో కేసుపై విచారణ చేయడం సబబు కాదని వివరించింది. 6 నెలల్లో అమరావతి నిర్మించాలని గతంలో ఏపీ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై గత విచారణలో సుప్రీం స్టే విధించింది. ఈ క్రమంలో కేంద్రం, ప్రతివాదులకూ సుప్రీం నోటీసులు అందిస్తోంది. ఇద్దరు ప్రతివాదులు మరణించినట్లుగా తమ వద్ద నివేదిక ఉందని రిజిస్ట్రీ గుర్తు చేసింది. కాగా, మిగతా వాళ్లందరికీ నోటీసులు పంపించామని రిజిస్ట్రీ, ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు మరణించిన ప్రతివాదులను జాబితా నుంచి తొలగించాలని కోర్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం తరఫు లాయర్ విన్నవించారు. ఈ మేరకు వాటి వివరాలను ప్రత్యేకంగా ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది.