Page Loader
సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి, 12 మందికి గాయాలు
సాగర్‌ కాల్వలోకి దూసుకెళ్లిన పెండ్లి బస్సు

సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి, 12 మందికి గాయాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 11, 2023
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓ పెళ్లి బస్సు కాల్వలోకి దూసుకెళ్లి ఏడుగురు మరణించిన దుర్ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దర్శి సమీపంలో సదరు పెళ్లి బస్సు సాగర్‌ కాల్వలోకి చొచ్చుకెళ్లింది. ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో మరో 12 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సహాయక చర్యల్లో భాగంగా క్రేన్‌ ను తెప్పించి బస్సును బయటకు తీశారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ దారుణం జరిగిందని సమాచారం.

DETAILS

వెడ్డింగ్ రిసెప్షన్‌ నిమిత్తం కాకినాడ వెళ్తుండగా దుర్ఘటన

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది పెళ్లి బృందం సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. వెడ్డింగ్ రిసెప్షన్‌ నిమిత్తం కాకినాడ వెళ్లేందుకు సదరు పెళ్లి బృందం ఆర్టీసీ గరుడ బస్సును కిరాయికి తీసుకుంది. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పొదిలి నుంచి బస్సు బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే దర్శి వద్దకు రాగానే ఎదురుగా ఉన్న లారీని తప్పించేందుకు బస్సు డ్రైవర్‌ ప్రయత్నించారు. దీంతో పెళ్లి వాహనం అదుపుతప్పి సాగర్‌ కాల్వలోకి దూసుకెళ్లి విషాదఛాయలను మిగిల్చింది. మృతులను అబ్దుల్‌ అజీజ్‌(65), అబ్దుల్‌ హాని(60), షేక్‌ రమీజ్‌(48), ముల్లా నూర్జహాన్‌(58), ముల్లా జానీబేగం (65), షేక్‌ షబీనా(35), షేక్‌ హీనా (6)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.