
Supreme Court: ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో నిబంధనలతో గ్రీన్ టపాకాయలను అనుమతించిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీ ప్రజలకు దీపావళికి ముందుగానే పండుగలాంటి వార్త వెలువడింది. సుప్రీంకోర్టు ఐదు ఏళ్ల నిషేధం తర్వాత, గ్రీన్ క్రాకర్స్ వెలిగించేందుకు అనుమతి ఇవ్వడం ద్వారా పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఈ ప్రత్యేక అనుమతులు అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు వర్తిస్తాయని, బాణసంచాలను రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలని స్పష్టం చేసింది. సర్టిఫైడ్ క్రాకర్స్ దుకాణాల ద్వారా మాత్రమే గ్రీన్ క్రాకర్స్ విక్రయించడానికి ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించారు.
వివరాలు
విక్రయ నియమాలు,పర్యవేక్షణ
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మాత్రమే గ్రీన్ పటాకుల విక్రయానికి అనుమతి ఉన్నప్పటికీ, ఈ-కామర్స్ ద్వారా విక్రయానికి నిషేధం విధించబడింది. క్యూఆర్ కోడ్ ఉన్న గ్రీన్ పటాకులు మాత్రమే అనుమతించబడతాయి. వీటి విక్రయం,అలాగే వెలిగించే సందర్భంలో పోలీసులు ప్రత్యేక పహారా బృందాలను ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. సాంప్రదాయ పటాకుల అక్రమ విక్రయం వల్ల కాలుష్యం పెరుగుతుందనే అంశాన్ని కోర్టు ఉల్లేఖించింది. "అర్జున్ గోపాల్" కేసు తీర్పులో, గ్రీన్ పటాకుల వాడకంతో ఉద్గారాల పరిమాణం తగ్గినట్టు కోర్టు అభిప్రాయపడ్డది. సుప్రీంకోర్టు గ్రీన్ పటాకుల అభివృద్ధిలో నీరీ (NEERI) సంస్థ పాత్రను ప్రశంసించింది. పర్యావరణ పరిరక్షణ మరియు సాంప్రదాయ ఉత్సవాల మధ్య సమతౌల్యం సాధించడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది.
వివరాలు
గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి?
CSIR-NEERI ప్రకారం, తక్కువ షెల్ సైజు, తక్కువ రసాయన వాడకం, బూడిద రహితంగా తయారు చేసిన బాణసంచాలను గ్రీన్ క్రాకర్స్ అని పిలుస్తారు. వీటిలో సాంప్రదాయ హానికర పదార్థాలు.. సల్ఫర్ నైట్రేట్స్, సోడియం, లీడ్, మెగ్నీషియం, బ్లాక్ పౌడర్ వాడరు. ఫలితంగా వాయు,శబ్ద కాలుష్యం సుమారుగా 30% తగ్గుతుంది. సాధారణ బాణసంచా 160 డెసిబెల్స్ శబ్దం చేస్తే, గ్రీన్ క్రాకర్స్ 110 డెసిబెల్స్ మాత్రమే చేస్తాయి. ఎన్‌జీటీ అనుమతినిచ్చిన నగరాల్లో మాత్రమే గ్రీన్ క్రాకర్స్ ఉపయోగానికి అర్హత ఉంది.
వివరాలు
గ్రీన్ క్రాకర్స్‌ను గుర్తించడం ఎలా ?..
తమిళనాడులోని శివకాశీ కేంద్రంలో ప్రఖ్యాత గ్రీన్ క్రాకర్స్ తయారు అవుతాయి. వాటి బాక్స్‌లపై ఆకుపచ్చ CSIR-NEERI లోగో, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ప్రస్తుతం మూడు రకాల గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయి: స్వాస్: కాల్చినప్పుడు నీటి ఆవిరి విడుదల చేసి గాల్లో ధూళిని 30% తగ్గిస్తుంది. స్టార్: పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వాడకుండా వాయు కాలుష్యాన్ని,శబ్దాన్ని తగ్గిస్తుంది. సఫల్: మెగ్నీషియమ్ స్థానంలో తక్కువ అల్యూమినియమ్ వాడుతుంది; శబ్ద కాలుష్యం సాధారణ పటాకాలకు కంటే తక్కువ. నిపుణులు కేవలం కేంద్రం లైసెన్స్ పొందిన దుకాణాల నుండి మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.