Organ transplantation: దేశం మొత్తం ఒకే రూల్స్ మీద నడవాలి'… అవయవ మార్పిడి పై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా అవయవ మార్పిడి విషయంలో ఒకే విధమైన జాతీయ విధానం, సమాన నిబంధనలు రూపొందించాలని ఆదేశించింది. రాష్ట్రాలన్నింటితో చర్చించి అవయవ దానం,కేటాయింపు వ్యవస్థ పారదర్శకంగా,వేగంగా పని చేయాలనీ కోర్టు సూచించింది. సీఎం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌ల బెంచ్ ఈ ఆదేశాలు భారత అవయవ మార్పిడి సంఘం వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఇచ్చింది. 1994 అవయవ మార్పిడి చట్టానికి 2011లో చేసిన సవరణలను ఆమోదించేందుకు ఆంధ్రప్రదేశ్‌ను ఒప్పించే ప్రయత్నం చేయాలని కోర్టు కేంద్రానికి చెప్పింది. అలాగే 2014లో వచ్చిన అవయవాలు, కణజాల మార్పిడి నిబంధనలు ఇంకా అమలు చేయని కర్ణాటక, తమిళనాడు, మణిపూర్ రాష్ట్రాలు వీటిని త్వరగా అమలు చేయాలని ఆదేశించింది.
వివరాలు
కేంద్రం రాష్ట్రాలతో చర్చించి రాష్ట్ర అవయవ మార్పిడి సంస్థలు ఏర్పాటు చేయాలి
దేశవ్యాప్తంగా అవయవాల కేటాయింపుకు ఒకే తరహా మోడల్ ప్రమాణాలు ఉండేలా జాతీయ విధానం తయారుచేయాలని బెంచ్ సూచించింది. లింగం, కులం ఆధారంగా జరిగే వివక్షను తగ్గించే చర్యలు కూడా ఈ విధానంలో ఉండాలంటూ స్పష్టం చేసింది. మణిపూర్,నాగాలాండ్,అండమాన్-నికోబార్, లక్షద్వీప్‌లలో ఇంకా రాష్ట్ర అవయవ మార్పిడి సంస్థలు (SOTO) లేవని గుర్తించిన కోర్టు, రాష్ట్రాలతో చర్చించి ఇవి ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. అవయవాలు దానం చేసే లైవ్ డోనర్లు ఎలాంటి దుర్వినియోగానికి గురి కాకుండా చూసేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని కోర్టు కేంద్రానికి ఆదేశించింది. అలాగే జనన, మరణ నమోదు ఫారమ్‌లలో 'బ్రెయిన్‌డెత్' వివరాలు, కుటుంబానికి అవయవదానం ఆప్షన్ ఇచ్చారా అనే అంశం స్పష్టంగా ఉండేలా NOTTOతో కలిసి మార్పులు చేయాలని ఆదేశించింది.
వివరాలు
90% మార్పిడులు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే..
దేశంలో 2014 నిబంధనలు సమానంగా అమలు కాకపోవడం,ఏకీకృత జాతీయ డేటాబేస్ లేకపోవడం వల్ల అవయవ మార్పిడి ప్రక్రియ మందగిస్తున్నదని పిటిషనర్ వాదించారు. ఇప్పటికీ అవయవ మార్పిడి ఎక్కువగా ధనిక వర్గాలకే పరిమితమైందనీ,90% మార్పిడులు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదే కేసులో ఏప్రిల్ 21న కోర్టు,అన్ని రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు,ఆరోగ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించి అవయవ మార్పిడి చట్టాలు,1994 చట్టం,2011 సవరణలు,2014 నిబంధనల అమలు స్థితిపై వివరాలు సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. శవ దాతలు-లైవ్ డోనర్ల నిష్పత్తి,లింగ వివక్ష,అవగాహన కార్యక్రమాలు,ఆర్థిక సహాయం, అవయవాల మార్పిడి విధానాలు, సింగిల్-మల్టీ అవయవ మార్పిడి చేసే ఆసుపత్రుల లభ్యత వంటి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను 2025 జూలై 18లోగా సమర్పించాలని కోర్టు పేర్కొంది.