Supreme Court: దిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్: 4 వారాల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలి
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి కఠినంగా స్పందించింది. కాలుష్య బారిన పడిన దిల్లీకి ఊపిరి అందించేలా తక్షణమే ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, దిల్లీ ప్రభుత్వం రెండింటికీ స్పష్టమైన గడువును విధించింది. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) చేసిన సూచనలను ఎలా అమలు చేస్తారన్న దానిపై వివరణ ఇస్తూ, వచ్చే నాలుగు వారాల లోపు పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య నియంత్రణ విషయంలో ఇకపై ఎలాంటి సాకులు, ఆలస్యాలు సహించబోమని స్పష్టంగా హెచ్చరించింది.
వివరాలు
కాలుష్య స్థాయిలను తగ్గించేందుకు సీఏక్యూఎం మొత్తం 15 దీర్ఘకాలిక చర్యలకు సూచన
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ జయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత రోజురోజుకూ మరింత క్షీణిస్తున్న తీరుపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తాత్కాలిక చర్యలు సరిపోవని, దీర్ఘకాలిక వ్యూహం అవసరమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సీఏక్యూఎం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. దిల్లీలో కాలుష్య స్థాయిలను తగ్గించేందుకు సీఏక్యూఎం మొత్తం 15 దీర్ఘకాలిక చర్యలను సూచించిందని తెలిపారు. ఈ సూచనలు ఎంతో కీలకమైనవని, వాటి అమలులో ఎలాంటి జాప్యం జరగకూడదని ధర్మాసనం పేర్కొంది.
వివరాలు
ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ సవరించాలి
కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే వాహనాలను దశలవారీగా రోడ్లపై నుంచి తొలగించాలని, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) వ్యవస్థను మరింత కఠినంగా అమలు చేయాలని సీఏక్యూఎం సిఫార్సు చేసింది. అలాగే రైలు రవాణా, మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించడం, ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని సవరించి వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలను కూడా అమలు చేయాలని సూచించింది.