Patanjali Case : యోగా గురు రామ్‌దేవ్‌ను మరోసారి మందలించిన సుప్రీంకోర్టు.. మీరు అమాయకులు కాదు
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యి వ్యక్తిగతంగా సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. అయితే, సుప్రీంకోర్టు ఈ విషయమై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అంతకముందు ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదని మండిపడింది. ఈ వ్యవహారంలో తమ తప్పునుఒప్పుకుంటూ వారం రోజుల్లోగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. అంతకుముందు విచారణ సందర్భంగా బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ, మేం చేసిన తప్పుకు బేషరతుగా క్షమాపణలు కోరుతున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటామన్నారు. కోర్టు ఆదేశాలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం మాకు లేదు'' అని కోర్టుకు తెలిపారు.
ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా
నయం చేయలేని రోగాలపై ప్రకటనలు ఇవ్వకూడదని మీకు తెలియదా? మీది బాధ్యతారాహిత్యం. మీరు చేసేది మంచి పనే అయినా.. అల్లోపతీని తగ్గించి చూపించకూడదు. మీ క్షమాపణలను పరిశీలిస్తాం. అయితే వారం రోజుల్లోగా దీనిపై బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వండి'' అని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేసింది. పతంజలి ఆయుర్వేదంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది.