Jet Airways: జెట్ ఎయిర్‌వేస్ కథ ముగిసింది.. లిక్విడేషన్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ విమానయాన సంస్థను లిక్విడేషన్ ప్రక్రియకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
దివాలా పరిష్కార ప్రయత్నాలు విఫలమవడంతో, రుణదాతలు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈమేరకు ఎన్‌సీఎల్‌టీ ముంబయి బెంచ్‌ను ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్‌ను నియమించాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆదేశాలతో జెట్ ఎయిర్‌వేస్ కథ ముగిసినట్లైంది.
వివరాలు
రుణదాతలు, కన్సార్షియం మధ్య విభేదాలు
ఆర్థిక సమస్యలతో జెట్ ఎయిర్‌వేస్ 2019లోనే కార్యకలాపాలు నిలిపివేసింది. దీనితో ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) చేరింది.
దివాలా ప్రక్రియలో జలాన్-కర్లాక్ కన్సార్షియం జెట్ ఎయిర్‌వేస్‌ను బిడ్డింగ్ ద్వారా చేజిక్కించుకుంది.
అయితే, రుణదాతలు, కన్సార్షియం మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని రుణదాతలు ఎన్‌సీఎల్‌ఏటీ (NCLAT)కి వెళ్లారు.
యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాలను అప్పిలేట్ ట్రైబ్యునల్ కూడా సమర్థించింది.
వివరాలు
సుప్రీంకోర్టుకు ఎస్‌బీఐ, ఇతర రుణదాతలు
అప్పిలేట్ ట్రైబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా ఎస్‌బీఐ, ఇతర రుణదాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన సీజేఐ, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను రద్దు చేసి, జలాన్ కర్లాక్ కన్సార్షియం ఉద్యోగుల జీతభత్యాలు, నిధుల విషయాల్లో విఫలమవడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా లిక్విడేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.
రుణదాతలు, ఉద్యోగులు, ఇతర భాగస్వాముల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుంది.