LOADING...
Cough Syrup: దగ్గు మందు వివాదం.. సీబీఐ విచారణ పిటిషన్‌ను కొట్టేసిన 'సుప్రీం'
దగ్గు మందు వివాదం.. సీబీఐ విచారణ పిటిషన్‌ను కొట్టేసిన 'సుప్రీం'

Cough Syrup: దగ్గు మందు వివాదం.. సీబీఐ విచారణ పిటిషన్‌ను కొట్టేసిన 'సుప్రీం'

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లో 'కోల్డ్‌రిఫ్‌' దగ్గుమందు (Coldrif Cough Syrup) సేవించిన తర్వాత పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ, ఔషధ భద్రతా వ్యవస్థల్లో సంస్కరణలు తీసుకురావాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యాజ్యంపై వెంటనే విచారణ చేపట్టాలంటూ పిటిషనర్‌, న్యాయవాది విశాల్‌ తివారి చేసిన వినతిని న్యాయస్థానం గురువారం పరిశీలనకు స్వీకరించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఏ రాష్ట్రం తరఫున వాదించడం లేదని స్పష్టం చేసిన ఆయన, అయితే తమిళనాడు, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు ఈ ఘటనపై చేపడుతున్న చర్యలను తక్కువగా అంచనా వేయరాదని ధర్మాసనానికి వివరించారు.

వివరాలు 

 సిరప్‌లో 48.6 శాతం డైఇథైలిన్‌ గ్లైకాల్‌ 

రాష్ట్రాలకే ఇటువంటి కేసులను దర్యాప్తు చేసే చట్టపరమైన యంత్రాంగాలు ఉన్నాయని,కాబట్టి సీబీఐ జోక్యం అవసరం లేదని ఆయన సూచించారు. దీంతో ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌,న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌,జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయవాది విశాల్‌ తివారి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ విషాదానికి కారణమైన'కోల్డ్‌రిఫ్‌'దగ్గుమందు తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న శ్రేసన్‌ ఫార్మా యూనిట్‌ తయారు చేసింది. చిన్నారుల మరణాల తర్వాత అధికారులు ఆ సంస్థలో దర్యాప్తు జరిపారు. పరిశీలనలో ఆ సిరప్‌లో 48.6శాతం డైఇథైలిన్‌ గ్లైకాల్‌ ఉన్నట్లు తేలింది. ఇది అత్యంత విషపూరిత పదార్థమని అధికారులు స్పష్టం చేశారు.ఈనేపథ్యంలో సంబంధిత కంపెనీపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.