Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరుచేసిన సుప్రీం
మద్యం విధానానికి సంబంధించి ఉన్న అవకతవకల వ్యవహారంలో, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట అందించింది. సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో, గత ఆరు నెలలుగా తిహాడ్ జైలులో ఉన్న కేజ్రీవాల్ త్వరలో బయటకి రానున్నారు. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ,బెయిల్ కోసం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన కేజ్రీవాల్ విన్నపాలపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజా తీర్పులో, ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ, రూ.10లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో బెయిల్‌ను అందించింది. మరోపక్క, కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానించకూడదని, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకుండా ఉండాలని, అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయకూడదని స్పష్టం చేసింది.
అరెస్టుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా, ధర్మాసనం అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ''సుదీర్ఘ కాలం నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించడంతో సమానం అంది. ఈ కేసులో అరెస్టు సరైనది అయినప్పటికీ, అది సమయానుకూలంగా లేదు. ఈడీ కేసులో బెయిల్ అందిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదు'' అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతీ వ్యక్తికి 'బెయిల్ అనేది నిబంధన, జైలు మినహాయింపు'గా ఉండాలని మరోసారి స్పష్టం చేసింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో,ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూర్చడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
జూన్ 20నకేజ్రీవాల్‌కు సాధారణ బెయిల్
ఆ గడువు ముగియడంతో జూన్ 2న తిరిగి లొంగిపోయారు. జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఈడీ అభ్యంతరంతో, దిల్లీ హైకోర్టు తదుపరి రోజు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్ 25న ఉన్నత న్యాయస్థానం బెయిల్‌పై స్టే విధించడంతో, కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జులైలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదల అయ్యారు, కానీ సీబీఐ కేసులో ఆయనను అరెస్టు చేయడంతో, ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ, కేజ్రీవాల్ సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో తిహాడ్ జైలులో కొనసాగారు.