జ్ఞానవాపి మసీదులో సర్వేకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. నిర్మాణాలకు నష్టం జరగకూడదని స్పష్టం
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు శాస్త్రీయ సర్వే కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఓ షరతు విధించింది. నాన్-ఇన్వేసివ్ టెక్నిక్ పద్ధతిన (నష్టం జరగకూడదు) సర్వేను కొనసాగించాలని భారత పురావస్తు శాఖ (ASI) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సర్వేను ఆపాలని మసీదు కమిటీ దాఖలు చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మిగతా ప్రాంగణంలో సర్వే చేసి, హిందూ ఆలయ స్థానంలో మసీదు నిర్మించారా,లేదా అనే విషయాన్ని తేల్చాలని వారణాసి కోర్టు తీర్పునివ్వగా, హైకోర్టు సమర్థించింది. తాజాగా సుప్రీం సైతం లైన్ క్లియర్ చేసింది. శుక్రవారం ఉదయం అధికారులు సర్వేని ప్రారంభించారు.