
Supreme Court: సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం.. సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో అధికారిక రిజర్వేషన్లు
ఈ వార్తాకథనం ఏంటి
75 ఏళ్ల చారిత్రాన్ని కలిగిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయబోతున్నది. ప్రత్యేకించి షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ)కు చెందిన సిబ్బందికి ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలతో నాన్-జ్యుడీషియల్ (న్యాయేతర) పోస్టుల నియామకాల్లో, పదోన్నతుల్లో ఈ వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ విధానాన్ని 2025 జూన్ 23 నుంచి అమలులోకి తీసుకువచ్చారు. ఈ కొత్త విధానం భారత సుప్రీంకోర్టు పరిపాలనా వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతున్నది.
వివరాలు
ఈ రిజర్వేషన్ విధానం న్యాయమూర్తుల నియామకాలకు వర్తించదు
ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ రిజర్వేషన్ విధానం న్యాయమూర్తుల నియామకాలకు వర్తించదు. ఇది కేవలం రిజిస్ట్రార్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్, ఛాంబర్ అటెండెంట్ వంటి న్యాయేతర ఉద్యోగాలకే వర్తిస్తుంది. ఈ రిజర్వేషన్ విధానంలో మూడు విభాగాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, నాన్-రిజర్వ్డ్. రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ.. "దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, హైకోర్టులన్నీ రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తున్న తరుణంలో, సుప్రీంకోర్టు మాత్రమే దానినుంచి మినహాయింపు ఎందుకు ఉండాలి? మన నైతిక విలువలు మన చర్యల్లో ప్రతిబింబించాలి" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
ఎస్సీ వర్గానికి 15 శాతం, ఎస్టీ వర్గానికి 7.5 శాతం రిజర్వేషన్లు
జూన్ 24న విడుదలైన సర్క్యులర్ ప్రకారం, ఎస్సీ వర్గానికి 15 శాతం రిజర్వేషన్లు, ఎస్టీ వర్గానికి 7.5 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. రోస్టర్ లేని సందర్భాల్లో లేదా రిజిస్టర్‌లో తప్పులు, అనుమానాస్పద అంశాలపై ఎవరైనా ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటే, రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్)కు తెలియజేయవచ్చని ఆ సర్క్యులర్ స్పష్టంగా పేర్కొన్నది.