Supreme Court: 'మళ్లీ అరెస్ట్ చేయాలంటే మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి': సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణతో పాటు పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా నియంత్రించే దిశగా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సరైన ఆధారాలు, చట్టబద్ధమైన కారణాలు లేకుండా చేసిన తొలి అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని తేలి.. ఆ వ్యక్తి విడుదలైన తర్వాత అతడిని పోలీసులు నేరుగా మళ్లీ అరెస్ట్ చేయలేరని స్పష్టం చేసింది. తిరిగి కస్టడీలోకి తీసుకోవాలంటే సంబంధిత జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని తేల్చిచెప్పింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అతుల్ చందూర్‌కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలు
ఆర్టికల్ 22(1) ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం.. తనను ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకునే ప్రాథమిక హక్కు ప్రతి పౌరుడికి ఉందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.
అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయడం తప్పనిసరి అని పేర్కొంది.
నేరం ఎంత తీవ్రమైనదైనా ఈ హక్కుకు మినహాయింపు ఉండదని తెలిపింది.
యూఏపీఏ, పీఎంఎల్‌ఏ వంటి కఠినమైన ప్రత్యేక చట్టాల కింద నమోదైన కేసుల్లోనూ ఆర్టికల్ 22(1) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ధర్మాసనం పేర్కొంది.
ఒకవేళ ఆర్టికల్ 22(1)ను ఉల్లంఘించి అరెస్ట్ చేయడంతో నిందితుడు విడుదలైతే.. అతడిని మళ్లీ అరెస్ట్ చేసేందుకు మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించే ముందు అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా నిందితుడికి అందించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
వివరాలు
పైఅధికారి ఆమోదం తప్పనిసరి
తొలి అరెస్టు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తేలిన సందర్భంలో.. అదే కేసులో రీ-అరెస్ట్ కోసం పోలీసులు మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించే దరఖాస్తుపై, మొదట నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారికి తక్షణ పైఅధికారి ఆమోద సంతకం చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
అంతేకాకుండా.. ఆర్టికల్ 22(1)ను ఉల్లంఘిస్తూ తొలి అరెస్టుకు కారణమైన పోలీసు అధికారిపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తప్పనిసరిగా ప్రారంభించాలని ఆదేశించింది.
రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిన అధికారికే తిరిగి అరెస్ట్ చేసే విచక్షణాధికారాన్ని అప్పగించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
వివరాలు
న్యాయపరమైన నియంత్రణ అవసరం
రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అధికారి చేతుల్లోనే మళ్లీ అరెస్ట్ చేసే విచక్షణాధికారం ఉండకుండా దానిపై న్యాయపరమైన నియంత్రణ అవసరమని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వ్యాఖ్యానించారు.
నిందితుడిని మొదటిసారి అరెస్ట్ చేసిన సమయంలో.. అరెస్టుకు గల కారణాలను ఎందుకు వెల్లడించలేకపోయారో పోలీసులు మేజిస్ట్రేట్‌కు సమర్పించే దరఖాస్తులో సహేతుకంగా వివరించాల్సి ఉంటుందని తెలిపారు.
ఆ దరఖాస్తును పరిశీలించిన మేజిస్ట్రేట్.. పోలీసుల అభ్యర్థన నిజాయితీతో కూడుకున్నదని భావించాలి.
అంతేకాకుండా, ఆ తర్వాత నిందితుడికి అరెస్టు కారణాలను అందించారని, అతడిని తిరిగి అరెస్ట్ చేయడం అత్యవసరమని సంతృప్తి చెందితేనే రీ-అరెస్ట్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.
వివరాలు
పాత అధికారిని కేసు దర్యాప్తు నుంచి తప్పించాలి
ఆర్టికల్ 22(1) ఉల్లంఘన కారణంగానే తొలి అరెస్టు చెల్లుబాటు కాకుండా నిందితుడు విడుదలైన సందర్భంలో.. అదే కేసు తదుపరి విచారణ బాధ్యతలను తొలి అరెస్టుకు బాధ్యుడైన పోలీసు అధికారి వద్ద కొనసాగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆ కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు, విచారణ బాధ్యతలను మరో పోలీసు అధికారికి అప్పగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
సుప్రీంకోర్టు తాజా తీర్పు ద్వారా.. అరెస్టు సమయంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను పోలీసులు తప్పనిసరిగా గౌరవించాల్సిన అవసరాన్ని మరోసారి స్పష్టం చేసినట్లైంది.
నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అరెస్టు అనంతరం నిందితుడిని మళ్లీ కస్టడీలోకి తీసుకునే ప్రక్రియపై కూడా న్యాయపరమైన పర్యవేక్షణ ఉండాలని ధర్మాసనం తేల్చిచెప్పింది.