4శాతం ముస్లిం రిజర్వేషన్లలపై రాజకీయ ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం
కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల ఉపసంహరణకు సంబంధించిన కేసుపై జరుగుతున్న రాజకీయ ప్రకటనలను సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఉత్తర్వు ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రంలోని ముస్లింలకు ఓబీసీ కేటగిరీలో దశాబ్దాలుగా ఉన్న 4శాతం రిజర్వేషన్‌లను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలైకి వాయిదా వేసింది. సబ్ జ్యూడీస్ విషయాలపై బహిరంగ ప్రకటనలు చేయరాదని, వాటికి రాజకీయాలతో సంబంధం లేదని కోర్టు పేర్కొంది. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ల ఉపసంహరణ అంశంపై అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటనపై పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మాట్లాడుతూ, ముస్లింలకు తమ పార్టీ రిజర్వేషన్ కోటాను ఉపసంహరించుకున్నట్లు షా గర్వంగా చెబుతున్నారని అన్నారు. ఈ విషయం సబ్ జ్యూడీస్ అయినప్పుడు, అలాంటి ప్రకటనలు ఎందుకు చేయాలి? అని జస్టిస్ బివి నాగరత్న ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. నాలుగు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని చెబుతున్నారని ఈ పోడియం నుంచి ఎస్‌జీగా, ఈ కేసులో హాజరవుతున్న న్యాయవాదిగా మీరు ప్రకటన చేయొచ్చని తుషార్ మెహతాను ఉద్దేశించి జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. కానీ బహిరంగ ప్రదేశం నుంచి మరొకరు ప్రకటన చేయడం పూర్తి భిన్నమని చెప్పారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి