Social Media Accounts: 18 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి?
ఈ వార్తాకథనం ఏంటి
18 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయాలా? అనే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించింది. భారతీయ ఒప్పందాల చట్టం ప్రకారం మైనర్లు సోషల్ మీడియా సంస్థలతో నేరుగా కాంట్రాక్టులు కుదుర్చుకోకుండా చట్టపరమైన నిబంధనలు తీసుకురావచ్చా అనే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్' అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ జరిపింది.
వివరాలు
పిల్లల ఆన్‌లైన్ భద్రతకు రక్షణలు అవసరం
పిటిషనర్ తరఫున న్యాయవాది హెచ్.ఎస్.ఫూల్కా చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రాన్ని వివరణ కోరింది.
భారత్‌లో పిల్లల ఆన్‌లైన్ భద్రతకు కొన్ని నిర్దిష్ట రక్షణలు ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ''కచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. తప్పకుండా చేస్తాం. మైనర్ల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకుంటాం'' అని తెలిపారు.
వివరాలు
భారత చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియా సంస్థలు
''సోషల్ మీడియా సంస్థలు భారతీయ చట్టాలకు లోబడి పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలి.
ఆయా సంస్థల సాఫ్ట్‌వేర్ కూడా భారత చట్టాలకు అనుగుణంగానే ఉండాలి'' అని జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి అన్నారు.
దీనిపై స్పందించిన తుషార్ మెహతా.. అది అభ్యర్థన కాదని, ఆదేశమని పేర్కొన్నారు.
ఈ అంశాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
వివరాలు
పుట్టిన తేదీ ఆధారంగానే ఖాతాల అనుమతి?
దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లో పిల్లల డిజిటల్ భద్రతకు సంబంధించి స్పష్టత లేకపోవడం వల్ల వారిపై సైబర్ ముప్పులు పెరుగుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.
భారతీయ ఒప్పందాల చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వ్యక్తి చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకోలేడని వివరించారు.
అయితే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, స్నాప్‌చాట్, ఎక్స్ వంటి డిజిటల్ వేదికలు కేవలం పుట్టిన తేదీ నమోదు ఆధారంగా మైనర్లకు ఖాతాలు తెరిచే అవకాశం కల్పిస్తున్నాయని చెప్పారు.
దీంతో మైనర్లు తమకు తెలియకుండానే ఆయా డిజిటల్ వేదికల నిబంధనలను అంగీకరిస్తున్న పరిస్థితి ఏర్పడుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
వివరాలు
గ్రూమింగ్ నుంచి సైబర్ నేరాల వరకు ముప్పులు
తల్లిదండ్రుల సమ్మతి లేకుండా మైనర్లు సోషల్ మీడియాను వినియోగించడం వల్ల అనేక ఆన్‌లైన్ ప్రమాదాలు ఎదురవుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో పిల్లలను మోసపూరితంగా నమ్మించే 'గ్రూమింగ్', సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం వంటి తీవ్రమైన ముప్పులు ఉన్నాయని తెలిపారు.
వయసు నిర్ధారణకు ఏకరూప వ్యవస్థ
పిల్లల వయసును నిర్ధారించడం, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల గుర్తింపును ధ్రువీకరించడం, వారి సమ్మతిని నిర్ధారించడం కోసం దేశవ్యాప్తంగా ఒకే విధమైన వ్యవస్థను రూపొందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
డిజిటల్ వ్యక్తిగత సమాచార రక్షణ చట్టం-2023 ప్రకారం పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాలంటే తల్లిదండ్రుల సమ్మతి అవసరమని న్యాయవాది గుర్తుచేశారు.
వివరాలు
ఐటీ చట్టంలో మార్పులు చేయాలని విజ్ఞప్తి
అయితే సోషల్ మీడియా ఖాతా సృష్టించడాన్ని నేరుగా నిషేధించే స్పష్టమైన నిబంధన ప్రస్తుతం లేదని తెలిపారు.
తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమ్మతి లేకుండా 18 ఏళ్లలోపు పిల్లలు డిజిటల్ ప్లాట్‌ఫాంలలో కాంట్రాక్టులు కుదుర్చుకునే అవకాశం లేకుండా చూడాలని పిటిషనర్ కోరారు.
ఇందుకు అనుగుణంగా ఐటీ చట్టం-2021లో అవసరమైన సవరణలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.