మాగుంట రాఘవ్‌కు సుప్రీం షాక్.. బెయిల్ 15 నుంచి 5 రోజులకు కుదింపు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. అక్రమ మద్యం కేసులో మాగుంట రాఘవ్‌కు మంజూరైన బెయిల్ ను కుదిస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఇటీవలే దిల్లీ ఉన్నత న్యాయస్థానం రాఘవ్‌కు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే దర్యాప్తు సంస్థ ఈడీ బెయిల్ ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది.
విచారించిన సుప్రీం, బెయిల్‌ను 5 రోజులకు కుదిస్తూ ఈనెల 12న లోకల్ కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
లిక్కర్ కుంభకోణంలో ఒంగోలు వైసీపీ ఎంపీ, మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్ నిందితుడిగా ఉన్నాడు.
Details
ధనవంతులకు తప్పుడు వైద్య నివేదికలు తేవడం అలవాటే : ఈడీ
అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదని,బెయిల్ కావాలని కోరుతూ రాఘవ్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారించిన కోర్టు, 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
ఈ క్రమంలోనే రాఘవ్ కోర్టుకు అబద్ధాలను చెప్పి మోసపూరితంగా బెయిల్ పొందినట్లు ఈడీ తరఫు న్యాయవాది సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. తొలుత అమ్మమ్మకు అనారోగ్యం ఉందని చెప్పి, అనంతరం నానమ్మకు బాగాలేదన్నారని కోర్టుకు వివరించారు.
ఆ తర్వాత భార్య ఆత్మహత్యాయత్నం అని తప్పుడు ఆధారాలు ఇవ్వబోయారన్నారు. అయితే ధ్రువపత్రాలను వెరిఫై చేస్తామంటే పిటిషన్ వెనక్కి తీసుకున్నారన్నారు.
ధనవంతులకు ఇలాంటి తప్పుడు వైద్య నివేదికలు తేవడం పరిపాటిగా మారిందని కోర్టుకు తెలిపారు. కుటుంబీకుల అనారోగ్యం పేరుతో మధ్యంతర బెయిల్‌కు ప్రయత్నిస్తున్నారన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు బెయిల్ 5 రోజులకు కుదించింది.