SupremeCourt: నా మెదడులో రిమోట్ సాయంతో కంట్రోల్ చేసే మెషిన్.. సుప్రీంకోర్టులో ఏపీ టీచర్ వింత పిటిషన్..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు దాఖలు చేసిన వింత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. తన మెదడును నియంత్రించడానికి కొందరు యంత్రాన్ని పెట్టారని, దాన్ని డియాక్టివేట్ చేయాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణర్హత లేదని జస్టిస్ సుధాన్షు ధూలియా, జస్టిస్ అహసుద్దీన్ అమనుల్లాహ్ ధర్మాసనం తిరస్కరించింది. మూడు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఈ అంశంపై రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఈ ఉపాధ్యాయుడు, హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైంటిఫిక్ లాబొరేటరీ (CFSL) నుంచి తీసుకొచ్చిన మెదడు నియంత్రణ యంత్రాన్ని తనపై ప్రయోగించారని ఆరోపించారు. ఆ యంత్రాన్ని డియాక్టివేట్ చేయాలని కోర్టు నుంచి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
నవంబరు 2022లో రిట్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, సీబీఐ,CFSLలకు నోటీసులు జారీ చేసి అఫిడవిట్ దాఖలు చేయమని కోరింది. CFSL తమపై ఎటువంటి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయలేదని స్పష్టం చేస్తూ అఫిడవిట్‌లో పేర్కొంది. దాంతో, హైకోర్టు నవంబరు 2022లో ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ ఏడాది సెప్టెంబరు 27న జస్టిస్ సుధాన్షు ధూలియా,జస్టిస్ అహసుద్దీన్ అమనుల్లాహ్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చిన ఈ పిటిషన్‌పై కోర్టు విస్తుపోయింది. విచిత్రమైన ఈ పిటిషన్‌లో జోక్యం చేసుకోవడం కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది.అయితే పిటిషనర్ సమస్యను అర్థం చేసుకునేందుకు అతని మాతృభాషలో లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా పరస్పర చర్చను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఆ పిటిషన్‌లో జోక్యం చేసుకునే అవకాశం లేదు: సుప్రీం
అతనితో మాట్లాడిన తర్వాత సమర్పించిన నివేదిక ప్రకారం, పిటిషనర్ కొందరు వ్యక్తులు తన మెదడును నియంత్రిస్తున్నారని, ఆ పరికరాన్ని డియాక్టివేట్ చేయాలనుకుంటున్నాడని తెలిపింది. ధర్మాసనం చివరగా ఆ పిటిషన్‌లో జోక్యం చేసుకునే అవకాశం లేదని, ఎటువంటి కారణం కనిపించలేదని పేర్కొంది.