Chandrababu Skill Scam Case: చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. 30 వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు
సుప్రీం కోర్టులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వల్ప ఊరట లభించింది. ఈనెల 30 వరకు చంద్రబాబు నాయుడును అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం ఫైబర్ నెట్ కేసుపై విచారణ చేపట్టిన అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణను మరోసారి వాయిదా వేసింది. స్కిల్ స్కాం కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ఇటీవల చికిత్స నిమిత్తం బెయిల్ పొందిన సంగతి తెలసిందే.
స్కిల్ స్కాం కేసులో తీర్పు వెల్లడయ్యే వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు
చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాలతో ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలియజేశారు. ఇప్పటికే చంద్రబాబుకు శస్త్రచికిత్స జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇక స్కిల్ స్కాం కేసులో తీర్పు వెల్లడయ్యే వరకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.