Supreme Court: నోట్ల కట్టల కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు షాక్
ఈ వార్తాకథనం ఏంటి
నోట్ల కట్టల వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనను పదవి నుంచి తొలగించాలంటూ వచ్చిన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఆమోదించడాన్ని, అలాగే తనపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానల్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును జనవరి 8న రిజర్వ్ చేసిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్‌సీ శర్మలతో కూడిన ధర్మాసనం గురువారం వెలువరించింది. గతేడాది జస్టిస్ యశ్వంత్ వర్మ దిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న సమయంలో, ఆయన అధికారిక నివాసంలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు లభ్యమయ్యాయి.
Details
త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టి నివేదిక సమర్పణ
ఈ ఘటనపై అంతర్గతంగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా ఆయన పదవికి రాజీనామా చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే జస్టిస్ వర్మ ఆ సూచనను అంగీకరించకపోవడంతో ఆయనపై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో లోక్‌సభ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన వాదనలను స్వీకరించని అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను తిరస్కరించడంతో, ఈ వ్యవహారంలో ఆయనకు మరోసారి న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలినట్టైంది.