కర్ణాటక సర్కారుకు సుప్రీంకోర్టు ఝలక్.. కావేరీ నీటి వివాదంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరణ
కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం ఝలక్ ఇచ్చింది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. తమిళనాడుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇటీవలే కర్నాటకకు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 28లోగా నీరివ్వాలని 18న ఉత్తర్వులు ఇచ్చింది. కన్నడనాటలో కరువు పరిస్థితులున్న సందర్భంగా కావేరి అథారిటీ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని సుప్రీంను ఆశ్రయించగా, న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు ప్రతి 15 రోజులకు భేటీ నిర్వహించాలని కావేరి అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది. కర్నాటక నుంచి రోజుకు 24 వేల క్యూసెక్కుల నీరు ఇప్పించాలని గతంలోనే తమిళనాడు ప్రభుత్వం సుప్రీం తలుపుతట్టింది.
15 రోజులకోసారి పరిస్థితిని సమీక్షించాలని సుప్రీం సూచన
కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిషన్, (CWRC), కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ (CEMA) ఇకపైనా కర్ణాటక, తమిళనాడు మధ్య నదీ జలాల పంపిణీని 15 రోజులకోసారి సమీక్షించాలని బోర్డులకు ధర్మాసనం సూచించింది. తమిళనాడుకు ప్రతిరోజూ 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలన్న నిర్ణయం, అసంబద్ధం, అనవసరమైంది కాదని తేల్చి చెప్పింది. ఈ రెండు బోర్డులు కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాకే నీటి కేటాయింపులు చేపట్టాయని జస్టిస్ బి.ఆర్.గవై నేతృత్వంలోని జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ పి.కె.మిశ్రాలతో కూడిన త్రిసభ్య కమిటీ సంతృప్తి వెలుబుచ్చింది. కర్ణాటక నుంచి తమిళనాడుకు 7,200 క్యూసెక్కుల నీరు అవసరమని CWRC, తొలుత నిర్ణయించింది. తర్వాత రోజుకు 5 వేల క్యూసెక్కులకు తగ్గించింది. ఈ మేరకు తమిళనాడు తరపున వాదనలు వినిపించారు.
బెంగళూరు నగరానికి తాగునీటి కొరత:కర్ణాటక
అయితే బిలిగుందులు ప్రాజెక్టు వద్ద 5 వేల క్యూసెక్కుల నీటి విడుదలకు CWRC ఆదేశాలను CWMA, సైతం నిర్థారించిందన్నారు. మరోవైపు ప్రతి రోజూ 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం కర్ణాటక ప్రయోజనాలకు విరుద్ధమని ఆ రాష్ట్రం తరుపున వాదనలు జరిగాయి. బెంగళూరు తీవ్రమైన తాగునీటి కొరతను ఎదుర్కొంటోందని, తమిళనాడుకు మాత్రం పంటల సాగుకు మాత్రమే నీటి ఆవశ్యకత ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే కర్ణాటకలో నీటి కష్టాలు అమాంతం పెరిగిపోయాయన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మరో 3,000 క్యూసెక్కుల నీటిని ఇచ్చేందుకు ఇబ్బందులున్నాయన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, దీనిపై తీర్పు వెల్లడించేందుకు నిరాకరించడం గమనార్హం.