Page Loader
ఉద్ధవ్ ఠాక్రే‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు; గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం
ఉద్ధవ్ ఠాక్రే‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు; గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం

ఉద్ధవ్ ఠాక్రే‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు; గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం

వ్రాసిన వారు Stalin
May 11, 2023
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో జూన్ 2022లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ గురువారం కీలక తీర్పును వెలువరించింది. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి పెద్ద ఊరటనిస్తూ, ఉద్ధవ్ ఠాక్రే‌కు గట్టి షాకిచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే బలపరీక్షను ఎదుర్కోకుండా రాజీనామా చేసినందున ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించమని ఆదేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే అప్పటి గవర్నర్ బీఎస్ కోష్యారీ చర్యలు చట్టబద్ధంగా లేవని ధర్మానసం పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ కృష్ణ మురారి, ఎంఆర్ షా, హిమా కోహ్లీ, పీఎస్ నర్సింహన్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.

శివసేన

అనర్హత పిటిషన్లను పరిష్కరించాలని స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

అసెంబ్లీలో బలపరీక్షకు ఎంవీఏ ప్రభుత్వాన్ని గవర్నర్ పిలవడం సబబు కాదని సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అనర్హత ప్రక్రియ విషయంలో కోర్టు జోక్యాన్ని సమర్థించే అసాధారణ పరిస్థితులు ఏవీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అనర్హత పిటిషన్లను పరిష్కరించాలని స్పీకర్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. గతేడాది జూన్‌లో 39మంది ఎమ్మెల్యేలతో ఏకనాథ్ షిండే శివసేన నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాఢీ(ఎంవీఏ) ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత షిండే బీజేపీతో పొత్తు పెట్టుకుని తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. తిరుగుబాటుదారులను అనర్హులుగా ప్రకటించాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో షిండేకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.