Supreme Court : రిషికొండలో నిర్మాణాలపై సుప్రీం సంచలన తీర్పు.. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని నిలదీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో రుషికొండ ప్రాంతంలో ఏపీ సర్కార్ చేపట్టిన నిర్మాణాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ క్రమంలోనే పిటిషన్ రాజకీయంగా ప్రేరేపితమై ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే విశాఖలోని రుషికొండ నిర్మాణాల అంశంలో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత కోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచనలు చేసింది. రుషికొండలో అక్రమ నిర్మాణాలు, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా విజయవాడకు చెందిన పర్యావరణ వేత్త లింగమనేని శివరామ ప్రసాద్ పిల్ దాఖలు చేయడం గమనార్హం.
ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది : సీజేఐ
ఈ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఏపీ హైకోర్టు, ఎన్జీటీల్లో కేసులు పెండింగ్ ఉన్న కారణంగా ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. ఇదే సమయంలో పిల్ దాఖలుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది రాజకీయ ప్రేరేపితంగా ఉందని, రాజకీయాలకు ఇది సరైన వేదిక కాదని సూచించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దని అంటారా, ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని పిటిషనర్ ను భారత ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.