LOADING...
Euthanasia Case: కోమాలో 13 ఏళ్లు: హరీశ్ రాణా కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
కోమాలో 13 ఏళ్లు: హరీశ్ రాణా కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

Euthanasia Case: కోమాలో 13 ఏళ్లు: హరీశ్ రాణా కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవిస్తోన్న 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. హరీశ్ తల్లిదండ్రులు తమ కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం అత్యున్నత న్యాయస్థానం విచారణ నిర్వహించింది. హరీశ్ కోలుకోవడం అసాధ్యం అని వైద్యులు ధ్రువీకరించారని, మానవీయ దృష్టికోణంలో అతనికి మర్యాదపూర్వక చావును ప్రసాదించాలంటూ కుటుంబం కోర్టును కోరింది. సుప్రీంకోర్టు ఈ కేసుపై తీర్పు రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.విచారణ సమయంలో ధర్మాసనం కొంత ఆవేదన వ్యక్తం చేసింది.

వివరాలు 

ఎవరు బతకాలో, ఎవరు చనిపోవాలో నిర్ణయించడానికి మనకు అధికారం ఉందా

"ఈ కేసులో 'కారుణ్య మరణం' అనే పదాన్ని మేము ఉపయోగించలేము. మనం ఎన్నో కేసులు చూస్తున్నప్పటికీ, ఇది అత్యంత సున్నితమైన విషయం.మేమూ మనుషులమే.;ఎవరు బతకాలో, ఎవరు చనిపోవాలో నిర్ణయించడానికి మనకు అధికారం ఉందా?" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని కోర్టు పరిశీలించబోతున్నట్లు కూడా తెలిపింది.

వివరాలు 

ఎవరీ హరీశ్‌ రాణా..? 

దిల్లీ నివాసి, 32 ఏళ్ల హరీశ్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతూ ఉంటూ ప్రమాదానికి గురయ్యాడు. నాలుగవ అంతస్తు బాల్కనీ నుంచి పడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. శరీరం చలనం లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స పొందినా, ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి పురోగతిని కనిపించలేదు. అప్పటి నుండి హరీశ్ కోమాలో ఉన్నాడు. ఇన్నేళ్లుగా అతడి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉండి అతడిని చూసుకుంటున్నారు. కుమారుడి చికిత్స కోసం ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన ఆ తల్లిదండ్రులు అతడి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ 2024లో దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తరువాత సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసినప్పటికీ మొదట నిరాశే ఎదురైంది.

Advertisement

వివరాలు 

హరీశ్ కోలుకోవడం అసాధ్యం

తరువాత వైద్యులు హరీశ్ కోలుకోవడం అసాధ్యం అని మరొకసారి నివేదికలు సమర్పించడంతో, అతడి కుటుంబం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మెడికల్ రిపోర్ట్లను పరిశీలించిన కోర్టు, హరీశ్ కేసును విచారించడానికి అంగీకరించింది. ఈ క్రమంలో, 2026 జనవరి 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హరీశ్ తల్లిదండ్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

Advertisement