Delhi Air Pollution : ఈ నెల 17న ఢిల్లీ-ఎన్‌సీఆర్ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిందన్న విషయం తెలిసిందే. ఈ సమస్యపై పార్లమెంట్‌లో చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, కేంద్ర ప్రభుత్వం అందుకు సమ్మతించింది. ఇదే సమయంలో, ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) ప్రాంతంలో మరింత ముదురుతున్న వాయు కాలుష్య పరిస్థితిపై విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని డిసెంబర్ 17వ తేదీన విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్‌తో పాటు న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చి, విపుల్ ఎం. పంఛోలిలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించింది.
వివరాలు
ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు విచారణ
ఈ కేసులో కోర్టుకు అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ కీలక వాదనలు వినిపించారు. వాయు కాలుష్య నియంత్రణకు అవసరమైన నివారణ చర్యలు ఇప్పటికే ఉన్నప్పటికీ, వాటిని అధికార యంత్రాంగం సక్రమంగా అమలు చేయకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసే వరకూ అధికారులు అమల్లో ఉన్న ప్రోటోకాల్స్‌కూ కట్టుబడి ఉండడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి, ఈ వ్యవహారం డిసెంబర్ 17వ తేదీన (బుధవారం) ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు విచారణకు రానున్నట్లు స్పష్టం చేశారు.