Swachh Survekshan Awards 2023: క్లీనెస్ట్ సిటీగా ఈ రెండు నగరాలు .. తెలుగు రాష్ట్రాలలో ఈ పట్టణాలకు చోటు..
ఇండోర్,సూరత్‌లు దేశంలోని 'క్లీన్ సిటీస్'గా ఎంపిక అయ్యాయి. ఈరోజు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ వార్షిక స్వచ్ఛ సర్వేలో నవీ ముంబై మూడవ స్థానాన్ని నిలుపుకుంది. 'స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023'లో 'అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలు' విభాగంలో మహారాష్ట్ర అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తదితరులు పాల్గొన్నారు. ఇండోర్ వరుసగా ఏడోసారి క్లీనెస్ట్ సిటీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
నాలుగో స్థానంలో విశాఖపట్నం
సర్వే ఫలితాల ప్రకారం,1లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న అన్ని నగరాల్లో మహారాష్ట్రకు చెందిన సస్వాద్ క్లీనెస్ట్ సిటీ అవార్డును పొందింది. ఈ విభాగంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పటాన్,మహారాష్ట్రలోని లోనావాలా వరుసగా రెండు,మూడు స్థానాల్లో నిలిచాయి. వారణాసి బెస్ట్ క్లీనెస్ట్ గంగా పరివాహక పట్టణంగా నిలువగా..దీని తర్వాత ప్రయాగ్ రాజ్ ఉంది. క్లీనెస్ట్ కంటోన్మెంట్(Mhow Cantonment) బోర్డుల విభాగంలో మధ్యప్రదేశ్‌లోని మోవ్ కంటోన్మెంట్ బోర్డ్ టాప్ ర్యాంక్ పొందింది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం నాలుగో స్థానంలో, విజయవాడ(6), తిరుపతి(8), హైదరాబాద్(9) నగరాలు తొలి 10 సిటీల్లో చోటు దక్కించుకున్నాయి. డేటా ప్రకారం,4,447 పట్టణ స్థానిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో పాల్గొన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛ సర్వేక్షణ్ అని ప్రభుత్వం పేర్కొంది.