Prashant Kishor: 'పూర్తి బాధ్యత నాదే '.. ఓటమిపై ప్రశాంత్ కిషోర్ తొలి స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
జన్ సురాజ్ పార్టీ బిహార్ ప్రజల నమ్మకాన్ని సంపాదించలేకపోయిందని ఆ పార్టీ అధినేత,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన తీవ్ర పరాజయం తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చి స్పందించారు. తమ ఆలోచనల్లో ఏదో చోట తప్పిదం జరిగి ఉండొచ్చని,ఆ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆ బాధ్యత మొత్తాన్ని శాతం 100 తానే స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. బీహార్ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కొత్త పాత్రలోకి వచ్చామని, కానీ ప్రజలు తమను అంగీకరించలేదని తెలిపారు. తమ ఆలోచనల్లో ఎక్కడో లోపం జరిగి ఉండొచ్చని ఆయన విచారం వ్యక్తం చేశారు.
వివరాలు
ఈ నెల 20న గాంధీ భీతిహర్వా ఆశ్రమంలో ఒకరోజు మౌన ఉపవాసం
ఎంత నిజాయితీగా శ్రమించినా,తుదకు ఫలితం పూర్తిగా విఫలమైందని చెప్పి,దాన్ని ఒప్పుకోవడంలో ఎలాంటి సంకోచం లేదన్నారు. తాను గత మూడు సంవత్సరాలుగా ఎంత కష్టపడ్డానో అందరికీ తెలుసని,తన శక్తి మేరకు ప్రతిదీ చేసానని గుర్తుచేశారు. అయినా సరే, ఇక వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని చెప్పారు.బీహార్‌ను మెరుగుపర్చాలనే సంకల్పం నెరవేరే వరకు తాను వెనుదిరగనని ధృవీకరించారు. బీహార్ ఓటర్లు ఎలాంటి ప్రమాణాలతో ఓటేయాలి, కొత్త వ్యవస్థ ఎందుకు అవసరమో ప్రజలకు పూర్తిగా అర్థం చేయించడంలో తాను విఫలమయ్యానని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ నెల 20న గాంధీ భీతిహర్వా ఆశ్రమంలో ఒకరోజు మౌన ఉపవాసం చేపట్టనున్నట్లు ప్రకటించారు. తప్పులు జరిగి ఉండొచ్చు కానీ ఎలాంటి నేరం చేయలేదని స్పష్టం చేశారు.
వివరాలు
పేద, అమాయక ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనాలనే ప్రయత్నం చేయలేదు: ప్రశాంత్ కిషోర్
సమాజంలో కుల ద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలు, హిందూ-ముస్లిం రాజకీయాలు, మతపరమైన విభజన.. ఇలాంటి ఏ పనిని తాను ఎప్పుడూ చేయలేదని చెప్పారు. బీహార్‌లోని పేద, అమాయక ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనాలనే ప్రయత్నం కూడా తాను చేయలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. పైగా, అభ్యర్థుల డిపాజిట్లు కూడా కోల్పోయింది. అధికారంలోకి వస్తామని ధైర్యంగా చెప్పిన ప్రశాంత్ కిషోర్‌కు బీహార్ ఓటర్లు కఠిన నిర్ణయమే ఇచ్చారు.