తాలిబాన్ ప్రతినిధులకు ఆన్‌లైన్ క్రాష్ కోర్సులో భారత్ శిక్షణ
అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ సభ్యులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యే 'ఇండియా ఇమ్మర్షన్' ఆన్‌లైన్ కోర్సుకు హాజరయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఐఎం-కోజికోడ్‌లో ఈ ఆన్ లైన్ క్రాష్ కోర్సును నిర్వహిస్తోంది. మార్చి 14 నుంచి మార్చి 17 వరకు ఆన్‌లైన్ శిక్షణ ఇస్తున్నారు. భారతదేశ వ్యాపార వాతావరణం, సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ వ్యవస్థపై లోతైన అవగాహనను పెంపొందించడానికి 'ఇమ్మెర్సింగ్ విత్ ఇండియన్ థాట్స్' అంశంపై శిక్షణ ఇచ్చేందుకు భారత్ భాగస్వామ్య దేశాలను ఆహ్వానించింది. తాలిబాన్ల పాలనను భారత్ గుర్తించికపోయినప్పటికీ, ఆ దేశ ప్రతినిధులను ఆహ్వానించడం గమనార్హం.
1964లో ఐటీఈసీ ఏర్పాటు, 160 దేశాల ప్రతినిధులు
ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ)ప్రోగ్రామ్‌లో భాగంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఆన్ లైన్ కోర్సును నిర్వహిస్తోంది. ఐటీఈసీ అనేది చాలా పురాతనమైనది. 1964లో ఐటీఈసీని స్థాపించారు. కెపాసిటీ-బిల్డింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రముఖమైనది. ఐటీఈసీ ప్రోగ్రామ్‌లో 160 కంటే ఎక్కువ దేశాల నుంచి 200,000మంది అధికారులు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో తాలిబాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిప్లమసీ అధిపతి ఈ కోర్సు కోసం నమోదు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాలిబాన్ పాలనను గుర్తించకపోయినప్పటికీ, వారి ప్రతినిధులను భారత్ శిక్షణకు ఆహ్వానించింది.