అఫ్ఘనిస్థాన్: ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్‌ను హతమార్చిన తాలిబాన్ దళాలు
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో తాలిబాన్ భద్రతా దళాలు ఇస్లామిక్ స్టేట్ గ్రూపుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. మూడో వ్యక్తిని అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. తాలిబాన్ దళాలు హతమార్చిన ఇస్లామిక్ స్టేట్ నాయకుల్లో టాప్ కమాండర్ ఖరీ ఫతే ఉన్నాడు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థకు టెలిజెన్స్ చీఫ్‌గా ప్రస్తుతం ఖరీ ఫతే ఉన్నారు. ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) పేరుతో అప్ఘాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తాలిబాన్‍కు ఇస్లామిక్ స్టేట్ బద్ధ శత్రువు.
అఫ్ఘాన్‌లో ఉగ్రదాడులను పెంచిన ఇస్లామిక్ స్టేట్
ఆగస్ట్ 2021లో దేశాన్ని తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఇస్లామిక్ స్టేట్ తన ఉగ్రదాడులను ఆఫ్ఘనిస్తాన్‌లో పెంచింది. తాలిబాన్ పెట్రోలింగ్ దళాలు, షియా మైనారిటీ వర్గాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో ఇస్లామిక్ స్టేట్ నిఘాపెట్టినట్లు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ చెప్పారు. కాబూల్ ఆపరేషన్ నివాస పరిసరాల్లో జరిగిందని వివరించారు. ఖేర్ ఖానా పరిసరాలు ఐఎస్‌కి ముఖ్యమైన రహస్య స్థావరం అని ఆయన పేర్కొన్నారు.