Page Loader
Ashwini Vaishnaw: తమిళ సంస్కృతి గొప్ప ఆస్తి: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
తమిళ సంస్కృతి గొప్ప ఆస్తి: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

Ashwini Vaishnaw: తమిళ సంస్కృతి గొప్ప ఆస్తి: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2025
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ విద్యావిధానం అంశంపై కేంద్రం-తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. తమిళం ఎంతో మధురమైన భాష అని ప్రశంసించారు. ఈ సందర్భంగా రూ.1,112 కోట్లతో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తమిళం ఒక మధురభాష అని, మనమంతా తమిళ సంస్కృతిని గౌరవిస్తామన్నారు. ఇది దేశానికి, ప్రపంచానికి లభించిన గొప్ప ఆస్తి అని కొనియాడారు. ఈ విషయం మనందరికీ గర్వకారణమని, అంతేకాకుండా అన్ని భారతీయ భాషలను సమానంగా ఆస్వాదించాలన్నారు.

Details

స్నేహబంధాలను దెబ్బతీయకూడదు

ప్రధాని కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని, ప్రతిభాషకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలన్నారు. అయితే భాషా పరమైన వివాదాలు మన మధ్య స్నేహబంధాలను దెబ్బతీయకూడదన్నారు. దేశాన్ని ఐక్యంగా నిలిపి, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మన లక్ష్యమని అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యానించారు. జాతీయ విద్యావిధానంలోని(NEP-2020)త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలను నేర్చుకోవాలని, అందులో రెండు భారతీయ భాషలు ఉండాలని స్పష్టం చేస్తోంది. అయితే హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని కొన్ని రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో త్రిభాషా విధానం చుట్టూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.