బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం
తమిళనాడులోని కాంచీపురంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా ఫ్యాక్టరీలో మంటల చేలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు ఫ్యాక్టరీలోనే చనిపోయారు. మరో 15 మంది గాయపడ్డారని, వారిని కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 15 మందిలో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది.
ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. కాంచీపురం జిల్లా కలెక్టర్ ఎం ఆర్తి, డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి పాకలవన్, పోలీస్ సూపరింటెండెంట్ ఎం సుధాకర్ సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పేలుడు సంభవించిన తర్వాత అంబులెన్స్ వచ్చేలోపు స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆటోల్లో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.