Tata Group: టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఏపిలో మరో 20 హోటళ్లు.. ముఖ్యమంత్రితో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ భేటీ
టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ సంస్థ రాష్ట్రంలో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశంతో మరో 20 హోటళ్లను (తాజ్, వివాంతా, గేట్‌వే, సెలెక్టియన్స్, జింజర్ హోటల్స్) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం జరిగిన సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన కీలక రంగాలపై టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. టాటా గ్రూప్ రాష్ట్రాభివృద్ధిలో ఒక ముఖ్య భాగస్వామిగా కొనసాగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు.
సౌర,పవన విద్యుత్ ప్రాజెక్టులకు రూ.40,000కోట్ల పెట్టుబడులు
"ఈరోజు అమరావతిలో టాటా కంపెనీల ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్ గారితో సమావేశం జరిగింది.రతన్ టాటా గారి దార్శనికత,సహకారం దేశ పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేసింది. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎంతో విలువైనది.ఈ సమావేశంలో కొన్ని కీలక రంగాలపై చర్చించాం," అని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖపట్నంలో కొత్తగా ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి టీసీఎస్ కట్టుబడి ఉందని,దాదాపు 10,000మందికి ఉపాధి కల్పిస్తామని చంద్రశేఖరన్ తెలిపారు. టాటా పవర్ సంస్థ 5,000మెగావాట్ల సౌర,పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.40,000కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం డీప్ టెక్, కృత్రిమ మేధను వినియోగిస్తూ పరిష్కారాలను కనుగొనే దిశగా తమ సహకారాన్ని అందించేందుకు టాటా సంస్థ ఆసక్తి చూపుతోంది.