Loading...
Rahul Gandhi: టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. ప్రధాని మోదీ, అమిత్‌ షాలపై రాహుల్‌ గాంధీ విమర్శలు
టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. మోదీ,అమిత్‌ షాలపై రాహుల్‌ విమర్శలు

Rahul Gandhi: టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. ప్రధాని మోదీ, అమిత్‌ షాలపై రాహుల్‌ గాంధీ విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌ ఛైర్మన్‌ నియామకంపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. టాటా గ్రూప్‌ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు వ్యాపారవేత్తలు కూడా ముందుకు రావడం లేదని విమర్శించారు. టాటా గ్రూప్‌ అనుసరిస్తున్న సామాజిక బాధ్యతలు, యాజమాన్య విధానాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

వివరాలు 

ప్రమాదంలో ఉద్యోగుల భవిష్యత్తు

టాటా గ్రూప్‌ను కుట్రపూరితంగా నాశనం చేస్తున్నారని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

టాటా ట్రస్టులను బలహీనపరిస్తే, ఆ సంస్థ పరిధిలోని కంపెనీలతో పాటు వాటిపై ఆధారపడి జీవిస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంత జరుగుతున్నా ఏ వ్యాపారవేత్త కూడా ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడేందుకు సాహసించడం లేదని అన్నారు.

వ్యాపారవేత్తలు ఇంకెంతకాలం మౌనంగా ఉంటారని ప్రశ్నించారు. వారిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే వరకు మౌనంగా ఉంటారా? అని నిలదీశారు.

భారత్‌లో వ్యాపార రంగం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల చేతుల్లోని ఆటబొమ్మ కాదని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

వివరాలు 

స్పందించని టాటా గ్రూప్‌ 

ఈ అంశంపై ప్రశ్నించేందుకు వ్యాపారవేత్తలు ధైర్యం చేయకపోయినా, తాము మాత్రం ప్రశ్నిస్తామని చెప్పారు.

ఈ వ్యవహారంలో తగిన న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేశారు.

రాహుల్‌ గాంధీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, టాటా గ్రూప్‌ నుంచి కానీ ఎలాంటి స్పందన వెలువడలేదు.

ఇటీవల టాటా సన్స్‌ బోర్డు సమావేశంలో ఎన్‌. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఈ పునర్నియామక నిర్ణయం చట్టవిరుద్ధమని, దానికి చట్టబద్ధత లేదని టాటా ట్రస్టులు వ్యతిరేకిస్తున్నాయి.

ఇప్పటికే ఈ అంశంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ADVERTISEMENT