LOADING...
Araku coffee: అరకు కాఫీ మార్కెటింగ్‌కు టాటాతో ఎంఓయూ.. గిరిజనుల అభివృద్ధికి కుదిరిన 21 ఒప్పందాలు
గిరిజనుల అభివృద్ధికి కుదిరిన 21 ఒప్పందాలు

Araku coffee: అరకు కాఫీ మార్కెటింగ్‌కు టాటాతో ఎంఓయూ.. గిరిజనుల అభివృద్ధికి కుదిరిన 21 ఒప్పందాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

గిరిజన ప్రాంతాల అభివృద్ధి,ఆదివాసీల జీవనోపాధి అవకాశాల పెంపు,అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ప్రోత్సాహం,పర్యాటక రంగ అభివృద్ధి వంటి కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు అవగాహన ఒప్పందాలను (ఎంఓయూలు) కుదుర్చుకుంది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రభుత్వ,ప్రైవేటు సంస్థలతో ఈ ఒప్పందాలు అమల్లోకి వచ్చాయి. రంపచోడవరం పరిసరాల్లో రబ్బరు సాగును విస్తరించేందుకు ఐటీడీఏ, కేంద్రీయ రబ్బరు బోర్డుతో ఒక ముఖ్య ఒప్పందం కుదిరింది. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలు, అలాగే అరకు కాఫీ ప్రమోషన్‌ కోసం జీసీసీతో మరో ఎంఓయూ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మెప్మా ఆధ్వర్యంలో అరకు కాఫీ కియోస్కుల ఏర్పాటుకు ప్రత్యేక ఒప్పందం కుదిరింది.

వివరాలు 

అరకు కాఫీకి బ్రాండింగ్‌,మార్కెటింగ్‌ కల్పించేందుకు జీసీసీతో భాగస్వామ్యం చేసుకున్న టాటా సంస్థ

జీసీసీ ఉత్పత్తులను విదేశీ మార్కెట్లలో విక్రయించేందుకు 'హాతీ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌సీ' కంపెనీతో జీసీసీ కలిసి పని చేయనుంది. అదేవిధంగా, గిరిజన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు సంయుక్తంగా రిటైల్‌ షోరూమ్‌ల ఏర్పాటుపై ట్రైఫెడ్‌ ఏపీ, జీసీసీ మధ్య అంగీకారం కుదిరింది. టాటా సంస్థ, అరకు కాఫీకి బ్రాండింగ్‌,మార్కెటింగ్‌ కల్పించేందుకు జీసీసీతో భాగస్వామ్యం చేసుకుంది. చింతపల్లి ప్రాంతంలో రెడ్‌ చెర్రీ పండ్ల రైపెనింగ్‌, ప్రాసెసింగ్‌ యూనిట్‌ స్థాపన కోసం సబ్‌కో సంస్థతో మరో ఒప్పందం కుదిరింది. అదే విధంగా,పాడేరు ఐటీడీఏతో ఐటీసీ సంస్థ 1,600 హెక్టార్లలో కాఫీ తోటల విస్తరణకు ముందుకొచ్చింది. గిరిజన మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించేందుకు ఫ్రాంటియర్‌ మార్కెటింగ్‌,ఈజీమార్ట్‌ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి.

వివరాలు 

గిరిజన ప్రాంతాల్లో హోంస్టేలు ఏర్పాటుకు ఓయో హోమ్స్‌, హూమీ హట్స్‌ సంస్థలు

పసుపు ఉత్పత్తుల మార్కెటింగ్‌, ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ఎక్విన్‌ సంస్థ ఐటీడీఏతో ఎంఓయూ కుదుర్చుకుంది. అటవీ ఉత్పత్తులను గిరిజన మహిళా సంఘాల ద్వారా విక్రయించేందుకు అవసరమైన అవగాహన, శిక్షణ కల్పించేందుకు ఐఎస్‌బీ సంస్థ కూడా ఒప్పందం చేసింది. పర్యాటక రంగంలో భాగంగా, గిరిజన ప్రాంతాల్లో హోంస్టేలు ఏర్పాటుకు ఓయో హోమ్స్‌, హూమీ హట్స్‌ సంస్థలు ముందుకు వచ్చాయి. గిరిజన విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు మార్పు సొసైటీతో ప్రత్యేక ఎంఓయూ కుదిరింది. అదనంగా, గిరిజన పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు ఏపీ టూరిజం ఫోరం సహకారం అందించనుంది.