LOADING...
TCS in Vizag: విశాఖపట్టణంలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూపు.. 10 వేల మందికి ఉపాధి 
విశాఖపట్టణంలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూపు

TCS in Vizag: విశాఖపట్టణంలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూపు.. 10 వేల మందికి ఉపాధి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2024
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్‌ సుముఖత వ్యక్తం చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి లభిస్తుంది. టాటా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి నారా లోకేశ్‌ ముంబయిలో మంగళవారం జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయే అధికారం చేపట్టాక టాటా సంస్థ విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు రావడం కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రముఖ ఐటీ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇది రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

అనువైన వాతావరణం కారణం 

ఐటీ రంగ అభివృద్ధికి అనువైన వాతావరణం విశాఖలో ఉండటం కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. దీని వల్ల ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తల రాకపోకలకు మరింత వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటికే ఇక్కడ టెక్‌మహీంద్రా, సింబయోసిస్‌తో పాటు పలు ప్రముఖ ఐటీ సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 'ఏ హబ్‌' పేరిట ఇన్‌క్యుబేషన్‌ కౌన్సిల్‌ ఇప్పటికే అందుబాటులో ఉంది. విశాఖ ఐటీ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందడానికి ఇవన్నీ దోహదం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

వివరాలు 

ఏపీ వైపు ప్రముఖ సంస్థల చూపు 

రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.లులు,ఓబెరాయ్,బ్రూక్‌ఫీల్డ్, సుజలాన్‌ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. ప్రఖ్యాత ఐటీ కంపెనీల ద్వారా యువతకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని యువగళం పాదయాత్రలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు. అందులో భాగంగా టాటా గ్రూపు ఛైర్మన్‌తో సంప్రదింపులు జరిపారు. ముంబయిలోని టాటా సన్స్‌ కార్యాలయం బాంబే హౌస్‌లో ఆ సంస్థల ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి లోకేశ్‌ మంగళవారం సమావేశమయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం.. విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను టీసీఎస్‌ ఛైర్మన్‌కు మంత్రి వివరించారు.

వివరాలు 

టాటా గ్రూపు త్వరలో ఒప్పందం

సమావేశం అనంతరం,విశాఖలో టీసీఎస్‌ సెంటర్‌ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్రంలో ఈవీ,ఏరో స్పేస్,స్టీల్,హోటల్స్,పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. ఈసందర్బంగా మంత్రి లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. 'విశాఖలో టీసీఎస్‌ సెంటర్‌ ఏర్పాటు ద్వారా 10 వేల మందికి ఉపాధి కల్పించేందుకు ఆ సంస్థఛైర్మన్‌ అంగీకరించడం సంతోషంగా ఉంది.స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నినాదంతో ప్రముఖ కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం స్వాగతిస్తోంది.ఐటీ,ఎలక్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు టీసీఎస్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ పెట్టుబడి తొలిఅడుగు అవుతుంది'అని లోకేశ్‌ పేర్కొన్నారు. టీసీఎస్‌ సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో టాటా గ్రూపు త్వరలో ఒప్పందం చేసుకోనుంది.