
#NewsBytesExplainer: జూనియర్ ఎన్టీఆర్ 'వార్' సినిమా విడుదల వివాదం.. అనంతపురంలో అభిమానుల ఆందోళన,చంద్రబాబు సీరియస్
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమాను టీడీపీ వర్గీయులు చూడొద్దంటూ.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బెదిరించారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఒక ఆడియో సోషల్ మీడియాలో లీక్ కావడం ద్వారా, NTR సినిమాను ఎందుకు చూడాలని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నట్లు వినిపించడంతో అభిమానుల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఆ ఆడియోలో ఆయన గళం, మాటలు పోలి ఉండడంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. అనంతపురంలోని ఆయన క్యాంప్ ఆఫీస్ ముందు NTR అభిమానులు ధర్నాకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. "లోకేష్ పేరు వస్తే సినిమా ప్రదర్శించవద్దు"అని ఇచ్చిన హెచ్చరిక జూనియర్ NTR అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
వివరాలు
అన్ని ప్రాంతాల్లో NTR అభిమానుల నిరసనలు
దీంతో అభిమానులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళన అనంతపురం మాత్రమే కాక, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లలకు కూడా విస్తరించింది. అన్ని ప్రాంతాల్లో NTR అభిమానులు దీని పై నిరసనలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ లోపల కూడా కలకలం రేపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పార్టీ నేతల నిర్లక్ష్య వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, అహంకారాలు, వర్గపోరాటాలు మాత్రమే పార్టీకి కాక, ప్రజలకు కూడా నష్టం కలిగిస్తాయని స్పష్టంగా అన్నారు.
వివరాలు
వైరల్ ఆడియోపై స్పందించిన ఎమ్మెల్యే ప్రసాద్
జూనియర్ NTR ని విమర్శిస్తున్నట్టు ప్రచారం అయ్యే ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ వెల్లడించారు. అనంతపురం లో ఇటీవల జరిగిన రాజకీయ పోరు సమయంలో తనను బద్నాం చేసేందుకు ఆ ఆడియోను తయారు చేశారని ఆయన ఆరోపించారు. తాను నందమూరి నారా కుటుంబాల పెద్ద అభిమానిగా ఉన్నందున ఎప్పటికీ అలాంటి విమర్శలు చేయరని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీకి విచారణ కోసం కూడా కోరినట్టు, వాస్తవాలు బయటపడుతాయని తెలిపారు.
వివరాలు
ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఘటనలపై అసహనం
అనంతపురం సంఘటనతో పాటు ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై కూడా సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. "పార్టీ కంటే వ్యక్తిగతం గొప్పదని భావించే వారికి టీడీపీలో స్థానం లేదు" అని కఠినంగా హెచ్చరించారు. పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. నేతలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత నిర్ణయాలు పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉంటే ఇక సహించమని స్పష్టం చేశారు. చిన్న విమర్శలకు కూడా ఆస్కారం ఇవ్వకుండా, నేతలందరూ బాధ్యతగా ప్రవర్తించాలని ఆయన సూచించారు.
వివరాలు
సూపర్ సిక్స్ సమీక్ష - స్పష్టమైన సందేశం
అమరావతిలో జరిగిన సమావేశంలో చంద్రబాబు పార్టీ వర్గాలతో సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజల స్పందనపై సమీక్ష నిర్వహించారు. ఉచిత బస్సు పథకంపై అన్ని ప్రాంతాల్లో అద్భుత స్పందన వస్తోందని పార్టీ విభాగాలు వివరించాయి. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావడం వల్ల వైసీపీ అంతర్మథనంలో పడిందని, తప్పుడు ప్రచారాలు చేసే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి. చంద్రబాబు నేతలకు, ఉచిత బస్సుపై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. పథకాల అమల్లో ఎమ్మెల్యేలు,మంత్రులు క్రియాశీలంగా పాల్గొనాలని చంద్రబాబు స్పష్టం చేశారు. "ప్రజలతో మమేకం కావడం ద్వారా మాత్రమే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది"అని ఆయన పేర్కొన్నారు. అనంతపురం ఘటనతో సహా పలు వివాదాలపై చర్చించి,గ్రూపు తగాదాలు,అంతర్గత విభేదాలు ఇకపై ఉపేక్షించమని హెచ్చరించారు.
వివరాలు
నివేదిక కోరిన చంద్రబాబు
అనంతపురం, ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఘటనలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి నివేదిక అడిగినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు, చర్యలు పార్టీకి చెడ్డపేరు తెస్తే ఇకపై మన్నించమని చంద్రబాబు స్పష్టం చేసినట్టు వర్గాలు తెలిపారు.