చంద్రబాబు కంటికి చికిత్స అవసరం.. అత్యవసర బెయిల్ కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కంటికి చికిత్స చేయాల్సి ఉన్నట్లు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. 3 నెలల క్రితమే ఆయనకు కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని వివరించారు. ఈ పిటిషన్ శుక్రవారం వెకేషన్ బెంచ్ ముందుకు విచారణకు రానుంది. చంద్రబాబు ఆరోగ్యంపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టమవుతోందని, టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
రెండో కంటికి ఆపరేషన్ అవసరం లేదన్న వైద్యులు : రాహుల్
ఇదే సమయంలో చంద్రబాబుకు కంటి సమస్యలున్నాయని, ఈ మేరకు చికిత్స అవసరమని బుధవారం ఆయన్ను పరిశీలించిన ప్రభుత్వాస్పత్రి కంటి వైద్యులు నివేదికను న్యాయవాదులు ఉదాహరించారు. మరోవైపు చంద్రబాబు కంటికి ఇప్పట్లో ఎటువంటి చికిత్సలు అవసరం లేదన్నట్లుగా సదరు నివేదికను మార్చేందుకు ప్రభుత్వ వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. జైలు అధికారులు బుధవారం విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులెటిన్ లోనూ ఆయన కంటి సమస్యలను అందులో పేర్కొనకపోవడంపై అభ్యంతరం తెలిపారు. స్పందించిన రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఆయా వ్యాఖ్యలను ఖండించారు. రెండో కంటికి ఆపరేషన్ అవసరం లేదని బుధవారం వైద్యులు తెలిపారని రాహుల్ స్పష్టం చేయడం గమనార్హం.