తెదేపా అధినేత చంద్రబాబుకు ఝలక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి కప్పట్రాళ్ల కుటుంబం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు గడవు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో చేరికలు జోరందుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా పేరుగాంచిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ అలియాస్ సుశీలమ్మ దంపతులు అధికార పార్టీ వైసీపీలో చేరిపోయారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తెదేపా మాజీ జెడ్పీటీసీ కప్పట్రాళ్ల సుశీలమ్మ, ఆమె భర్త దేవనకొండ మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా సుశీలమ్మ మాట్లాడుతూ తండ్రి వెంకటప్పనాయుడు తర్వాత ఆయన స్థానంలో తెదేపాకు సర్వం ధారపోశామన్నారు.
సీఎం జగనే మాకు రక్షణ కల్పిస్తారు : సుశీలమ్మ
తన తండ్రిని చంపిన వారిని చంద్రబాబు తిరిగి తెదేపాలో చేర్చుకున్నారని సుశీలమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఎంత పని చేసినా గుర్తింపు ఇవ్వని పార్టీలో ఉండటం ఎందుకని, అందుకే పార్టీ మారమన్నారు . తెదేపా కోసం పోరాడుతూ తమ ఫ్యామిలీ అనేక ఇబ్బందులపాలైన తమను పార్టీ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు హయాంలోనే బీసీలకు అన్యాయం జరిగిందని, ఇప్పటికీ తెదేపాయే బీసీల పక్షపాతిగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమం చూసే వైసీపీలోకి వచ్చామని, ఆయనే తమకు రక్షణ కల్పిస్తారని సుశీలమ్మ ధీమా వ్యక్తం చేశారు. బీసీ రాజకీయ నాయకులకు అనేక పదవులు ఇచ్చి చేతలతో బీసీ రాజకీయ సాధికారతను జగన్ నిరూపించుకున్నారని సుశీలమ్మ దంపతులు ప్రశంసలు కురిపించడం విశేషం.