LOADING...
Rajamahendravaram: 'విపశ్యన' సహకారంతో కోనసీమ జిల్లాలో విద్యార్థులకు 'ధ్యాన' బోధన.. ప్రయోగాత్మకంగా గురుకుల పాఠశాలల్లో శ్రీకారం
ప్రయోగాత్మకంగా గురుకుల పాఠశాలల్లో శ్రీకారం

Rajamahendravaram: 'విపశ్యన' సహకారంతో కోనసీమ జిల్లాలో విద్యార్థులకు 'ధ్యాన' బోధన.. ప్రయోగాత్మకంగా గురుకుల పాఠశాలల్లో శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

సమాజంలో మారుతోన్న జీవనశైలి ప్రభావం అన్ని వయసుల వారిపైనా తీవ్రంగా పడుతోంది. స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి సాధారణమైన భాగంగా మారిపోయింది. ఏ వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే బాల్యం నుంచి ఏకాగ్రత, క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, ఒత్తిడిని జయించే మానసిక బలంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పెద్దలు చెప్పే మాట. అలాంటి మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకునే మార్గమే ధ్యానం (మెడిటేషన్)అని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే నేపథ్యంలో డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌. మహేశ్‌కుమార్‌ జిల్లా పాఠశాలల్లో ధ్యానాన్ని ప్రవేశపెట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అంతర్జాతీయ విపశ్యన మెడిటేషన్‌ సెంటర్‌తో ఒప్పందం చేసుకున్నారు.

వివరాలు 

3,000 మంది విద్యార్థులు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 10నిమిషాల పాటు ధ్యానం

విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడం ద్వారా వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధ్యానంతో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం, మంచి వ్యక్తిత్వ లక్షణాలు పెరిగి, జీవితంలో మెరుగైన స్థాయికి ఎదగగలుగుతారని భావిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన అంతర్జాతీయ విపశ్యన మెడిటేషన్‌ సెంటర్‌ వాలంటీర్ల బృందం సహకారంతో ఈ ధ్యానాన్ని జిల్లాలోని ఎనిమిది గురుకుల పాఠశాలల్లో ప్రారంభించారు. దాదాపు 3,000 మంది విద్యార్థులు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 10నిమిషాల పాటు ధ్యానం చేసేలా అవసరమైన ఏర్పాట్లను చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన 30మంది 'విపశ్యన'సహాయక ఆచార్యుల బృందం ఆయా పాఠశాలల్లో ఆడియో సిస్టమ్‌ ద్వారా ప్రసారమయ్యే సందేశాల ఆధారంగా విద్యార్థులతో మిత్ర (మైండ్‌ ఇన్‌ ట్రైనింగ్‌ ఫర్‌ రైట్‌ అవేర్‌నెస్‌) ధ్యానాన్ని చేయిస్తున్నారు.

వివరాలు 

ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు

రెండు రోజులపాటు వారు ఆయా పాఠశాలల్లో ఉండి ఉపాధ్యాయులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా గురుకులాల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రెండో దశలో ఇతర ఉన్నత పాఠశాలల్లోనూ విస్తరించాలనే యోచనలో ఉన్నారు. ఇందుకోసం ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. 45 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించనున్నారు. ధ్యాన కార్యక్రమం ప్రారంభమైన 45 రోజులకు విద్యార్థుల్లో ఏవైనా మార్పులు ఉన్నాయా? సామర్థ్యాల్లో అభివృద్ధి జరిగిందా? అనే విషయాలను ఉపాధ్యాయులు, అధికారులు, విపశ్యన ప్రతినిధులు వేర్వేరుగా పరిశీలించి సమీక్షిస్తామని జిల్లా కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌ వెల్లడించారు.

వివరాలు 

 శిక్షణ పొందిన 2.5కోట్ల మంది విద్యార్థులు,లక్ష మంది ఉపాధ్యాయులు 

గతంలో పాడేరులో ఈ విధమైన కార్యక్రమాన్ని నిర్వహించగా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఈ సంస్థ ఒక సంవత్సరం పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, శిక్షణా దశలో వసతి,రవాణా సదుపాయాలను కల్పించేందుకు ఒప్పందాన్ని(ఎంవోయూ)చేసుకున్నట్లు తెలిపారు. 2001 నుంచి మహారాష్ట్రలో తమ సంస్థ ఈ విధమైన ధ్యాన శిక్షణను అందిస్తున్నట్లు విపశ్యన ప్రతినిధి అమర్‌నాథ్‌ తెలిపారు. ఇప్పటి వరకు 2.5కోట్ల మంది విద్యార్థులు,లక్ష మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారని వివరించారు. చిన్న వయసులోనే నైతిక విలువలను బాలుర్లో స్థిరీకరించడం ద్వారా వారు చెడుమార్గానికి వెళ్లకుండా సమాజానికి మంచి చేయగలరని పేర్కొన్నారు. ధ్యానంతో పిల్లలు శారీరకంగా,మానసికంగా చురుకుగా మారడంతోపాటు,ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని,క్రమశిక్షణ పెరగడంతో స్కూల్ డ్రాపౌట్స్‌ కూడా తగ్గిపోతాయని వివరించారు.