LOADING...
CUET-UG Exam delay: సీయూఈటీ-యూజీ 2026లో సాంకేతిక లోపం.. పలు కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష!
సీయూఈటీ-యూజీ 2026లో సాంకేతిక లోపం.. పలు కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష!

CUET-UG Exam delay: సీయూఈటీ-యూజీ 2026లో సాంకేతిక లోపం.. పలు కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2026
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) యూజీ-2026 పరీక్ష శనివారం కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైంది. సాంకేతిక లోపం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈ మేరకు ఎన్‌టీఏ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో ఒక ప్రకటన విడుదల చేసింది. పరీక్ష నిర్వహణలో భాగస్వామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వైపు ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల కొన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రారంభంలో జాప్యం జరిగినట్లు తెలిపింది. అయితే ఆ సమస్యను ఇప్పటికే పరిష్కరించామని, అభ్యర్థులకు ఎలాంటి నష్టం కలగకుండా పూర్తి అదనపు సమయం కల్పిస్తున్నామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

వివరాలు

అదనపు సమయాన్ని కేటాయిస్తాం

"టీసీఎస్‌ వద్ద ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా కొన్ని కేంద్రాల్లో సీయూఈటీ యూజీ-2026 పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం సమస్య పరిష్కారమైంది. పరీక్ష రాసే విద్యార్థులు నష్టపోకుండా పూర్తి పరిహార సమయం అందిస్తున్నామని ఎన్‌టీఏ పేర్కొంది. సాంకేతిక అంతరాయం నేపథ్యంలో మధ్యాహ్నం సెషన్ పరీక్షల షెడ్యూల్‌ను ఎన్‌టీఏ సవరించింది. మధ్యాహ్నం సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రిపోర్ట్ చేయాలని సూచించింది. పరీక్షను ముందుగా నిర్ణయించిన మధ్యాహ్నం 3 గంటల బదులుగా సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఉదయం సెషన్‌లో పరీక్ష రాసే అభ్యర్థులకు కూడా పూర్తి పరీక్ష సమయం అందిస్తామని ఎన్‌టీఏ పేర్కొంది.

వివరాలు

హెల్ప్ లైన్ నంబర్ల ఏర్పాట్లు

నిర్ణయించిన వ్యవధి పూర్తయ్యే వరకు వారికి పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేసింది. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి ఎన్‌టీఏ విచారం వ్యక్తం చేసింది. పరీక్షకు సంబంధించిన ఇబ్బందులు, సందేహాల పరిష్కారం కోసం +91-11-40759000 హెల్ప్‌లైన్ నంబర్‌తో పాటు [cuet-ug@nta.ac.in]ఈ-మెయిల్‌ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. కాగా, సెంట్రల్, స్టేట్ మరియు పలు ప్రైవేట్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2022లో సీయూఈటీ-యూజీ పరీక్షను ప్రవేశపెట్టారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఒకే వేదిక కల్పిస్తున్నారు. భాషా నైపుణ్యాలు, సబ్జెక్టు పరిజ్ఞానం, సాధారణ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఈ పరీక్షలో అంచనా వేస్తారు.

Advertisement