కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రధాన చర్చ వీటిపైనే!
తెలంగాణ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు నేడు(గురువారం) ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ ఏ అంశాలపై చర్చించాలనే విషయాన్ని నేడు జరిగే బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మాజీ ఎమ్మెల్సీ వేదెల వెంకట నర్సింహచారి మృతికి సంతాపం ప్రకటిస్తారు. ఈ సమావేశాల్లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, వరద నష్టంపై ప్రభుత్వ నిర్ణయాలు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా అనర్హత వంటి అంశాలపై ప్రధాన చర్చ జరగనుంది. అయితే ఈ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ ఉంటుందా? ఉండదా? జీరో అవర్ ఉంటుందా? ఉండదా? అనేదానిపై సందిగ్ధం నెలకొంది.
సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరి సమావేశాలు కావడంతో ప్రభుత్వం చేపట్టిన పథకాలను విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సమావేశాల మొదటి రోజునే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన బిల్లుతో పాటు గవర్నర్ వెనక్కి పంపిన మరో మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా వ్యవసాయం,సంక్షేమంపైనే షార్ట్ డిస్కషన్‌ను చేయనున్నారు. వర్సిటీల బిల్లు, వైద్యవిద్య సవరణ బిల్లులను గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపింది. ఈ బిల్లులను సవరించి అసెంబ్లీ అమోదంతో మళ్లీ గవర్నర్ కు పంపనున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహిస్తారనేది ఇంకా తెలియలేదు.