TG Assembly Session: డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9న ప్రారంభం కావడంతో, గవర్నర్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం,ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఏడాది గడిచిన సందర్భంగా ఈ సమావేశాలకు విశేషమైన ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన రోజులను ఈనెల 9న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. తెలంగాణలో సంక్రాంతి అనంతరం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో, రైతు బంధు విధివిధానాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు అంశాలతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చించి,రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన రైతులకు అనుకూలంగా అమలు చేయాలని నిర్ణయించారు.
అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత రావాలని సీఎం విజ్ఞప్తి
తెలంగాణలో ఆర్వోఆర్ చట్టం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కులగణన సర్వే ఫలితాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదా అన్నది ఇప్పుడు రసవత్తరంగా మారింది. డిసెంబర్ 9న సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత,అసెంబ్లీ సమావేశాలు రసవత్తరమైన చర్చలకు వేదిక అయ్యే అవకాశం ఉంది.
సీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా..
ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా,మూసీ నదీ ప్రక్షాళణ,రైతు భరోసా వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరగనున్నది. ప్రతిపక్షం, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొన్ని కీలక అంశాలపై ఉత్కంఠ రేపే చర్చలను సాగించనున్నది. ఈలోపు, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు,లగచర్ల ఘటన,రైతు భరోసా,బోనస్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ,ప్రభుత్వంపై విమర్శలు చేయనున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో,కేసీఆర్ ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు హాజరైన కేసీఆర్,సమావేశం ముగియకముందే వెళ్లిపోయారు. ఇప్పుడు,కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది చర్చనీయాంశం అయింది. ఆయన సమావేశానికి హాజరైతే,ప్రభుత్వ పెద్దల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందనేది మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుంది.