BJP : ఆశ్చర్యపర్చిన బీజేపీ రెండో జాబితా.. ఒకే ఒక్క నియోజకవర్గానికే పరిమితం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ బీజేపీ తన రెండో జాబితా విడుదల చేసింది. కానీ కేవలం ఒకే ఒక్క నియోజకవర్గానికి అభ్యర్థి పేరును ఖరారు చేసింది.దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
తొలి జాబితాలో ఏకంగా 52 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన కమలం అధిష్టానం, రెండో జాబితా వచ్చేసరికి కేవలం ఒక్క స్థానానికి పేరును వెల్లడించింది.
మహబూబ్ నగర్ అభ్యర్దిగా జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పేరును ప్రకటించింది.
తొలుత ఈ స్థానం నుంచి మాజీ ఎంపీ, సీనియర్ నేత జితేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని పార్టీ భావించింది.
కానీ తాను ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన పార్టీకి చెప్పారు. దీంతో ఆయన కుమరుడు పేరును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
details
తొలి జాబితాలో 17 మంది బీసీలు
ఈసారి ఎన్నికల్లో బీసీలనే ప్రధానంగా నమ్ముకున్న కాషాయదళం, తొలి జాబితాలో 17 మందికి అవకాశమిచ్చింది.
రెండో జాబితాలోనూ అలాంటి ప్రాధాన్యమే ఇస్తారని ఉత్కంఠగా అంతా ఎదురుచూస్తున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేపథ్యంపై బెట్టు చేయకుండా నియోజకవర్గాల్లో బలమైన ద్వితీయ శ్రేణి బీసీ నేతలకు అవకాశాలివ్వాలని అధిష్టానం అంచనాకు వచ్చింది.
కొత్త అభ్యర్థనలపై మరోసారి సమీక్షించి మిగతా 67 మంది పేర్లు ఖరారు చేసే ఉద్దేశంలో ఉంది.
తొలి జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశమిచ్చారు. మరోవైపు తొలి జాబితాలో తన పేరు రాకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
బీజేపీ-జనసేన పొత్తులపై ఇరు పార్టీల అగ్రనేతలు చర్చలు జరపనున్నారు. కనీసం 20 సీట్లు కేటాయించాలని కోరుతున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు.