హైదరాబాద్‌లో బీజేపీ స్టేట్ లీడర్ ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్.. ఎమ్మెల్యే సహా అనుచరులపై అనుమనాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్‌కు గురైన సంఘటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన భర్త కిడ్నాపయ్యారని తిరుపతి రెడ్డి భార్య సుజాత అల్వాల్ పోలీసులను ఆశ్రయించారు.
అల్వాల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద కొంత మంది వ్యక్తులు ఆయన్ను అపహరించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నగరంలోని కుషాయిగూడలో తిరుపతిరెడ్డి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.
అల్వాల్ పాకాలకుంట పరిధిలో తిరుపతి రెడ్డికి మరి కొంతమందికి గత కొంతకాలంగా భూవివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దాదాపు 5 వేల 929 గజాల స్థలం విషయంలో వివాదం రాజుకుంది.
DETAILS
17 తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించారని తిరుపతి రెడ్డి ఆందోళన
తమ భూమిని కబ్జా చేసేందుకు పలువురు యత్నిస్తున్నట్లు గతంలోనే తిరుపతి రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు చెందిన భూమిలో కొందరు వ్యక్తులు కబ్జాకు యత్నిస్తూ అక్రమంగా గోడలు నిర్మించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒకే ఫైల్ నెంబర్ మీద 17 తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి కోట్లాది విలువ చేసే భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
భూ వివాదంలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులే తన భర్త తిరుపతిరెడ్డిని అపహరించారని సుజాత ఫిర్యాదు చేశారు.
గురువారం మధ్యాహ్నం తిరుపతిరెడ్డి డ్రైవర్‌తో కలిసి అల్వాల్ ఎమ్మార్వో ఆఫీసుకెళ్లారు. పని మీద బయటకెళ్లిన కారు డ్రైవర్ తిరిగి వచ్చే సరికి యజమాని కనిపించలేదు.
DETAILS
సీసీ కెమెరాల ఆధారంగా పోలీసుల విచారణ
ఈ మేరకు ఫోన్ చేయగా, 2 ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. ఈ క్రమంలో జరిగిన విషయం అంతా తిరుపతిరెడ్డి భార్య సుజాతకు డ్రైవర్ వివరించారు.
దీంతో తన భర్త కనిపించట్లేదంటూ గురువారం రాత్రే సుజాత అల్వాల్ పోలీసులను ఆశ్రయించింది.
కిడ్నాప్ కేసులో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మామిడి జనార్థన్ పై బాధిత కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ముక్కెర తిరుపతిరెడ్డి జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దుబ్బకుంటపల్లి గ్రామానికి చెందిన వారు. జనగామ భాజపా టిక్కెట్ ను సైతం ఆశిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం ఓ భూ వివాదంలో కిడ్నాపై హత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్య తిరుపతిలు ఒకే మండలానికి చెందినవారు కావడం గమనార్హం.